అమరుల త్యాగాలను స్మరించుకోవాలి
సింగరేణి(కొత్తగూడెం): అమర వీరుల త్యాగాలు స్మరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు భాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్‌పాష అన్నారు. రుద్రంపూర్‌లో పునర్నిర్మించిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక సభ్యుడు దేవూరి శేషగిరిరావు విగ్రహాన్ని, సీపీఐ రాష్ట్ర నేత బందెల నర్సయ్య విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించారు. తొలుత నేతల చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ సింగరేణి ప్రధాన కార్యాలయంలో సాధారణ ఉద్యోగిగా జీవితం ప్రారంభించి శేషగిరిరావు నాటి తెల్లదొరల దోపిడీని వ్యతిరేకించి, కార్మిక హక్కుల సాధనకు కృషి చేశారని గుర్తుచేశారు. నాయకులు బి. అయోధ్య, కొరిమి రాజ్‌కుమార్, వాసిరెడ్డి మురళి, గనిగెల్ల వీరస్వామి, తోట రాజు, ముత్యాల విశ్వనాథం, తాటి వెంకటేశ్వర్లు, డి.వెంకన్న, పుల్లారెడ్డి, చంద్రగిరి శ్రీనివాస్, సలిగంటి శ్రీనివాస్, చండ్ర నరేంద్ర కుమార్ పాల్గొన్నారు.


