‘పేట’ అడవిలో అలజడి | - | Sakshi
Sakshi News home page

‘పేట’ అడవిలో అలజడి

Apr 10 2025 12:48 AM | Updated on Apr 10 2025 12:48 AM

‘పేట’ అడవిలో అలజడి

‘పేట’ అడవిలో అలజడి

● నాటు తుపాకులతో వన్యప్రాణుల వధకు వెళ్లిన వేటగాళ్లు ● తారసపడ్డ బేస్‌ క్యాంపు సిబ్బందిపై దాడి? ● పెనుగులాటలో నాటు తుపాకీ మిస్‌ఫైర్‌ ?

అశ్వారావుపేట: తెలంగాణ, ఏపీ సరిహద్దు గుబ్బలమంగమ్మ ఆలయ అటవీ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున తుపాకులతో సంచరిస్తున్న వేటగాళ్లు అలజడి సృష్టించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. గుబ్బలమంగమ్మ గుడి సమీపంలో ఏపీకి చెందిన ఆరుగురు వ్యక్తులు నాటు తుపాకులతో వన్యప్రాణుల వేటకు వచ్చారు. బేస్‌క్యాంపు సిబ్బంది గమనించడంతో ఇరువర్గాల మధ్య పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో మిస్‌ఫైర్‌ చోటుచేసుకుంది. అయితే ఎవరికీ గాయాలు కాలేదు. బేస్‌క్యాంపు సిబ్బందిపై వేటగాళ్లు తుపాకీతో దాడి చేసినట్లు తెలుస్తోంది. కాగా అటవీశాఖ సిబ్బంది ఒక తుపాకీ లాక్కోగా వేటగాళ్లు పరారయ్యారు. తెల్లవారుజాము కావడంతో ఎవరూ దొరకలేదు. బుధవారం ఉదయానికి మిస్‌ఫైర్‌ ఉదంతం అశ్వారావుపేట ప్రజలకు తెలిసింది. పరారైన వేటగాళ్లు ఏపీ సరిహద్దులోని గోపన్నగూడెం చేరుకున్నారు. పొద్దునే తుపాకులతో కొత్త వ్యక్తులు గ్రామంలో తిరుగుతుండటంతో గ్రామస్తులు ఆందోళన చెందారు. కొద్ది రోజులుగా జిల్లా చర్ల సరిహద్దు ఉన్న పొరుగు రాష్ట్రంలో భారీ ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తుపాకులతో వచ్చిన వారు పోలీసులా..? మావోయిస్టులా.? వేగటాళ్లా..? అనే ఆందోళన గ్రామస్తుల్లో నెలకొంది.

మధ్యవర్తిని ఆశ్రయించి పట్టుబడ్డారు?

బేస్‌క్యాంపు సిబ్బంది వద్ద ఉన్న తుపాకీ కోసం వేటగాళ్లు ఆరుగురు గోపన్నగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని ఆశ్రయించినట్లు సమాచారం. కొంత నగదు ఇస్తామని, తుపాకీ తెచ్చివ్వాలని కోరినట్లు తెలుస్తోంది. సదరు వ్యక్తి మధ్యవర్తిత్వం వహిస్తూ బేస్‌క్యాంపు సిబ్బందిని సంప్రదించగా.. అటవీశాఖ సిబ్బంది అతన్ని అదుపులో తీసుకున్నట్లు సమాచారం. మధ్యవర్తి ఇరుక్కుపోవడంతో వేటగాళ్లు దొరికినట్లు తెలుస్తోంది. కాగా ఆరుగురు వేటగాళ్లలో ముగ్గురినే అరెస్ట్‌ చూపడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై రేంజ్‌ అధికారి మురళిని వివరణ కోరగా.. ఇద్దరు వ్యక్తులు తుపాకులతో ఉండగా మరో వ్యక్తి మందుగుండు సామగ్రి, నీళ్లు మోస్తున్నాడని, మరో ముగ్గురు వ్యక్తులున్నా వారికి వేటకు సంబంధం లేదని విచారణలో తేలినట్లు పేర్కొన్నారు. రెండు తుపాకులు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే వేటతో సంబంధం లేని పొరుగు రాష్ట్రం వ్యక్తులు రాత్రి 2 గంటల సమయంలో వేటగాళ్లతో పాటు అటవీ ప్రాంతంలో ఎందుకు సంచరిస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అటవీశాఖకు చెందిన ఓ క్షేత్రస్థాయి అధికారి అనధికార అనుమతితోనే వేటగాళ్లు వేటకు వెళ్లారని, ఈ విషయం తెలియక బేస్‌ క్యాంప్‌ సిబ్బంది పట్టుకున్నట్లు తెలుస్తోంది. అందుకే బేస్‌క్యాంపు సిబ్బందిపై దాడి చేసినా ముగ్గురినే అరెస్ట్‌ చేసి, మరో ముగ్గురిని వదిలేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ముగ్గురు వేటగాళ్లను అరెస్ట్‌ చేశాం : ఎఫ్‌ఆర్వో

నాటు తుపాకులతో వన్యప్రాణుల వేటకు వచ్చిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్‌ చేశామని అశ్వారావుపేట ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి మురళి తెలిపారు. బుధవారం సాయంత్రం తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎఫ్‌ఆర్వో కథనం ప్రకారం.. తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో అశ్వారావుపేట రేంజ్‌ కావడిగుండ్ల సెక్షన్‌ కంట్లం బీట్‌ పరిధిలోని అడవిలో కంట్లం బేస్‌ క్యాంపు సిబ్బంది గస్తీ నిర్వహిస్తున్నారు. ముగ్గురు వ్యక్తులు రెండు నాటు తుపాకులతో తారసపడగా అదుపులోకి తీసుకుని అశ్వారావుపేట రేంజ్‌ కార్యాలయానికి తరలించారు. పట్టుబడిన వారిని విచారించగా ఏపీలోని ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కామవరం గ్రామానికి చెందిన కారం రవి, కామ మంగరాజు, వంజం నవీన్‌లుగా తేలింది. వన్యప్రాణుల వేటకు వచ్చినట్లు అంగీకరించడంతో వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement