పాల్వంచరూరల్: పాల్వంచ మండలం కేశవాపురం – జగన్నాధపురం మధ్య కొలువైన శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో శనివారం పౌర్ణమి సందర్భంగా చండీహోమం నిర్వహించనున్నారు. హోమంలో పాల్గొనే భక్తులు రూ.2,516 చెల్లించి గోత్రనామాలు నమోదు చేసుకోవాలని ఈఓ ఎన్.రజనీకుమారి సూచించారు. పూర్తి వివరాలకు 63034 08458 నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.
అడవుల పరిరక్షణ
అందరి బాధ్యత
డీఎఫ్‌ఓ కిష్టాగౌడ్
కరకగూడెం: అడవుల పరిరక్షణ అందరి బాధ్యత అని డీఎఫ్‌ఓ కిష్టాగౌడ్ అన్నారు. మండలంలోని అనంతారం రిజర్వ్ ఫారెస్ట్ ప్లాంటేషన్లను, అడవి జంతువుల కోసం ఏర్పాటు చేసిన నీటి వనరులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అడవుల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని, అడవులను నరకడానికి ప్రయత్నించినా, వన్యప్రాణులను వేటాడినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. అటవీ భూముల్లోకి అక్రమంగా ప్రవేశించే వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అడవుల సంరక్షణపై గ్రామీణులకు అవగాహన కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో మణుగూరు డివిజన్ అటవీ అధికారి సయ్యద్ మక్సుద్ మొయినొద్దీన్, అనంతారం ఫారెస్ట్ సెక్షన్ అధికారి గోవింద్ తదితరులు పాల్గొన్నారు.
12 మంది వెటర్నరీ
అసిస్టెంట్లకు ఉద్యోగోన్నతి
పాల్వంచరూరల్ : జిల్లాలో 12 మంది వెటర్నరీ అసిస్టెంట్లకు లైవ్‌స్టాక్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి లభించిందని పశు సంవర్థక శాఖ జిల్లా అధికారి డాక్టర్ ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. తమ కార్యాలయంలో బుధవారం కౌన్సిలింగ్ నిర్వహించామని, వెటర్నరీ అసిస్టెంట్లుగా రెండేళ్ల అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని సీనియారిటీ ప్రకారం ప్రమోషన్లు కల్పించామని పేర్కొన్నారు. ఉద్యోగోన్నతి పొందిన 12 మందిలో 8 మందిని జిల్లాలో ఖాళీగా ఉన్న వెటర్నరీ ఆస్పత్రులకు కేటాయించామని, మరో నలుగురు బదిలీపై ఖమ్మం జిల్లాకు వెళ్లారని తెలిపారు.
భక్తులకు మెరుగైన సేవలందించాం
భద్రాచలంటౌన్ : శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్వంలో మెరుగైన సేవలందించామని డీఎంహెచ్‌ఓ భాస్కర్‌నాయక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. భద్రాచలం, పర్ణశాల, కొత్తగూడెంలో రెండు రోజుల పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయగా 14,789 మంది భక్తులు ఈ శిబిరాలను వినియోగించుకున్నారని వివరించారు. ఏఓ బాలాజీ నాయక్, చైతన్య, మధువరన్ ఈ శిబిరాలను పర్యవేక్షించారని పేర్కొన్నారు.
దెబ్బతిన్న పంటల పరిశీలన
నష్టం అంచనాల్లో అధికారులు
అన్నపురెడ్డిపల్లి / చండ్రుగొండ : రెండు మండలాల్లో రెండురోజులపాటు గాలిదుమారంతో కురిసిన వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా రెండు మండలాల్లో అరకొరగా ఉన్న మామిడిపంట గాలిదుమారానికి నేలరాలింది. దీంతో రూ.లక్షల్లో నష్టం జరిగినట్లు రైతులు చెబుతున్నారు. కోతదశలో ఉన్న వరిపంట నేలవాలింది. వర్షం పడటంతో తేమకారణంగా ధాన్యం రంగుమారుతుందని, కోత కోసే పరిస్థితి లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న పంటకు పాక్షికంగా నష్టం వాటిల్లింది. చండ్రుగొండ, దామరచర్ల, అయన్నపాలెం, మద్దుకూరు, అబ్బుగూడెం, మర్రిగూడెం, రాజాపురం తదితర గ్రామాల్లో పర్యటించిన వ్యవసాయశాఖాధికారులు పంటనష్టం అంచనా వేస్తున్నారు.
12న పెద్దమ్మతల్లి ఆలయంలో చండీహోమం


