పురిటిగడ్డపై ప్రత్యేక దృష్టి
● ఇల్లెందు ప్రాంతానికి నష్టం కలగనివ్వం ● ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్‌ప్రసాద్
ఇల్లెందు: బొగ్గు గనులకు పుట్టినిల్లయిన ఇల్లెందుకు ఢోకా ఉండదని, ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తామని, ఎలాంటి నష్టం కలగనివ్వబోమని ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్, తెలంగాణ రాష్ట్ర కనీస వేతన చట్టం సలహా మండలి చైర్మన్ జనక్‌ప్రసాద్ స్పష్టం చేశారు. గురువారం ఇల్లెందు జేకే ఓసీలో జరిగిన ఫిట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. గత పదేళ్ల కాలంలో నాటి పాలకులు ఇల్లెందుపై శీతకన్ను ప్రదర్శించారని ఆరోపించారు. ఈ ప్రాంతం తీవ్రంగా నష్టపోతున్నా గుర్తింపు సంఘాల నాయకులు పట్టించుకోలేదని విమర్శించారు. నూతన గనుల ప్రారంభానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. ఇల్లెందు ఏరియాను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. నూతన గనుల కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రైవేట్ సంస్థలకు బొగ్గు బ్లాకులు వచ్చేలా చేసిందని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చర్చించి బొగ్గు పరిశ్రమ రక్షణ కోసం అనేక చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. ఇల్లెందు జేకే ఓసీ పొడిగింపు ఆదేశాలు, అనుమతులు త్వరలోనే వస్తాయని అన్నారు. పూసపల్లి ఓసీ కూడా ప్రారంభం అవుతుందన్నారు. ఇక్కడి కార్మికులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం జనక్‌ప్రసాద్, నర్సింహారెడ్డి, త్యాగరాజులను ఘనంగా సత్కరించారు. సమావేశంలో జనరల్ సెక్రటరీ వికాస్‌కుమార్ యాదవ్, ఆల్బర్ట్, జె.వెంకటేశ్వర్లు, గోచికొండ సత్యనారాయణ, భూక్యా నాగేశ్వరరావు, మహబూబ్, కళ్లం కోటిరెడ్డి, పడిదల నవీన్, కొండూరి చిన్నా తదితరులు పాల్గొన్నారు.


