ఊంజల్ సేవలో కల్యాణ రామయ్య
భద్రాచలం: సీతాలక్ష్మణ సమేతుడైన కల్యాణ రామయ్యకు గురువారం వైభవంగా ఊంజల్ సేవ నిర్వహించారు. దేవస్థానంలో జరుగుతున్న వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నూతన వధూవరులైన సీతారాములను ప్రత్యేకంగా అలంకరించిన ఊయలలో కొలువుదీర్చిన అర్చకులు లాలలు.. జోలలు పాడారు. ఆస్థాన హరిదాసులు భక్త రామదాసు, తూము నర్సింహదాసు కీర్తనలు ఆలపించగా ఊంజల్ సేవ ఆద్యంతం ఆకట్టుకుంది. అనంతరం స్వామివారికి స్వర్ణ పూరిత సింహవాహనంలో తిరువీధి సేవ జరిపారు.
13 నుంచి నిత్యకల్యాణాలు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామి వారికి వసంతోత్సవం జరపనున్నారు. శనివారం జరిపే చక్రతీర్థం, ధ్వజావరోహణం, పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగియనుండగా స్వామి వారి నిత్యకల్యాణాన్ని 13వ తేదీ నుంచి తిరిగి ప్రారంభిస్తారు.
పెద్దమ్మతల్లికి
సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు గురువారం 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. అనంతరం నివేదన, హారతి సమర్పించి మంత్రపుష్పం పఠించారు. కార్యక్రమంలో వేదపడింతులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
బూర్గంపాడు: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం పినపాక నియోజకవర్గంలో పర్యటించనున్నారు. బూర్గంపాడులోని గౌతమీపురం – సోంపల్లి బీటీ రోడ్డు, అశ్వాపురం మండలంలో అశ్వాపురం – బీజీ కొత్తూరు, అశ్వాపురం – జగ్గారం బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మణుగూరు సమితి సింగారంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదనపు తరగదుల నిర్మాణం, మణుగూరు – రామానుజవరం మధ్య హైలెవల్ బ్రిడ్జి, మణుగూరు – పగిడేరు మధ్య హైలెవల్ బ్రిడ్జి, పినపాక మండలంలో పినపాక – ఉప్పాక క్రాస్ బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత పినపాక – పోతిరెడ్డిపల్లి మధ్య బీటీ రోడ్డు, పినపాక – మల్లారం మధ్య బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశాక పినపాక–గడ్డంపల్లి మధ్య బీటీ రోడ్డును, పినపాకలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని ప్రారంభిస్తారు.
19న వెబినార్
కొత్తగూడెంఅర్బన్: భారతదేశ మొదటి ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇండియా స్పెస్ వీక్ న్యూ ఢిల్లీ వారిచే ఈనెల 19న ఆన్‌లైన్ వెబినార్ నిర్వహిస్తున్నట్లు డీఈఓ వెంకటేశ్వరాచారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వెబినార్‌లో పాల్గొనే విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈనెల 17వ తేదీ లోగా వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆలోచనలు పెంపొందించడంతో పాటు అంతరిక్ష విజ్ఞానంలో ఆసక్తి, అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఉపకరిస్తుందని పేర్కొన్నారు. వివరాలకు డీఎస్‌ఓ(92472 96012)ను సంప్రదించాలని తెలిపారు.
సాగర్ కాల్వలకు
నీరు నిలిపివేత
నాగార్జునసాగర్: సాగర్ కుడి, ఎడమ కాల్వ లకు గురువారం సాయంత్రం నీటి విడుదల నిలిపివేశారు. యాసంగి పంటలకు గాను అధికారులు గత ఏడాది డిసెంబర్ 15 నుంచి ఆయకట్టుకు ఏకధాటిగా నీరు విడుదల చేస్తున్నారు. కుడికాల్వ కింద ఏపీలో 10.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అలాగే, ఎడమకాల్వ కింద ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3,98,790 ఎకరాలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2,63,736 ఎకరాల్లో వరి సాగైంది. ఈ సీజన్‌లో 115 రోజుల పాటు కుడి కాల్వకు 100టీఎంసీలు, ఎడమ కాల్వకు 74టీఎంసీల నీటిని విడుదల చేశామని అధికారులు వెల్లడించారు.
ఊంజల్ సేవలో కల్యాణ రామయ్య


