పక్షం దాటితే.. ప్రమాద ఘంటికలే!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మే నెల రాకముందే గోదావరి వట్టిపోతోంది. దుమ్ముగూడెం ఆనకట్ట దిగువ భాగంలో నీటి నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి. దీంతో ఈ వేసవిలో తాగునీటికి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక కార్యాచరణ అవసరం కానుంది.
కాటన్ ఆనకట్ట నుంచే..
జిల్లాలోని మెజారిటీ ప్రాంతాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సరఫరా అవుతోంది. ఇందుకోసం పల్లె, పట్నం తేడా లేకుండా అంతటా ఓవర్‌హెడ్ ట్యాంక్‌లు నిర్మించడంతో పాటు ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇచ్చారు. అయితే ఇందుకు అవసరమైన రా వాటర్‌ను అశ్వాపురం మండలంలో గోదావరిపై నిర్మించిన కాటన్ ఆనకట్ట దగ్గర నుంచి తీసుకుంటున్నారు. మిషన్ భగీరథకు ప్రతీ రోజు 150 ఎంఎల్‌డీ నీటిని వినియోగిస్తున్నారు. గోదావరి తీరం వెంట విస్తరించిన హెవీ వాటర్ ప్లాంట్, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్, భద్రాచలం స్పెషల్ పేపర్ బోర్డ్ లిమిటెడ్‌లకూ ఈ నీటినే ఉపయోగిస్తున్నారు. గత నాలుగేళ్లుగా ఎగువ ప్రాంతం నుంచి నీటి ప్రవాహాలు సంతృప్తికర స్థాయిలో కొనసాగడంతో ఆనకట్ట నుంచి తాగు, పారిశ్రామిక అవసరాలకు నీటి కొరత ఎదురుకాలేదు. కానీ ఈసారి ఎగువ ప్రాంతం నుంచి గోదావరిలో ప్రవాహాలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.
తేలిన బండరాళ్లు..
కాటన్ ఆనకట్టకు ఎగువన ఉన్న లక్ష్మి, సమ్మక్క బరాజ్‌ల నుంచి కనీస ప్రవాహాలే దిగువకు వదులుతున్నారు. దిగువకు వస్తున్న నీటికి, ఉపయోగిస్తున్న నీటికి మధ్య పెద్దగా వ్యత్యాసం లేకపోవడంతో క్రమంగా గోదావరి ఎండిపోతోంది. నదిలో ఎడమ వైపు మిషన్ భగీరథ, హెవీవాటర్ ప్లాంట్ ఇన్‌టేక్ వెల్స్ దగ్గరగానే ప్రవాహాలు ఉన్నాయి. కుడివైపున ఉన్న పర్ణశాల వైపు నదిలో ఇసుక మేటలు వేయగా, నదీ గర్భంలోని బండలు బయటకు కనిపిస్తున్నాయి. చివరకు సరుకు రవాణ కోసం ఉద్దేశించిన కెనాల్‌లోనూ నీటి నిల్వలు తగ్గిపోయి అడుగు కనిపిస్తోంది. దీంతో ఈ కెనాల్‌పై నిర్మించిన హైడల్ పవర్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి కూడా ఆగిపోయింది.
పక్షం రోజులకే..
ప్రస్తుతం బరాజ్‌లో ఉన్న 0.98 టీఎంసీల నీటి నిల్వలు ఈ నెలాఖరు వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మిషన్ భగీరథకు సరిపోతాయనే ధీమాను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎండలు మరింతగా ముదిరితే నీటి ఆవిరి నష్టాలు పెరిగి ఈ సంఖ్య తగ్గిపోయే అవకాశముంది. పైనున్న లక్ష్మి, సమ్మక్క బరాజ్‌ల నుంచి విడుదల చేయించడంతో పాటు వచ్చే ప్రవాహాలను జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా సీతమ్మ సాగర్ నిర్మాణ పనులతో సంబంధం లేకుండా కాటన్ ఆనకట్టలో పూడిక తీత, లీకేజీలకు వెంటనే మరమ్మతులు చేసి ప్రతీ బొట్టును ఒడిసిపట్టాల్సిన అవసరముంది.
తగ్గుతున్న నీరు..
అశ్వాపురం – దుమ్ముగూడెం మధ్య గోదావరిపై నిర్మించిన ఆనకట్ట గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం ఆరు టీఎంసీలు. ఈ బరాజ్‌ను నిర్మించినప్పుడు డెడ్ స్టోరేజీ లెవల్ 36 మీటర్లు ఉండగా 49.5 మీటర్ల దగ్గర అలుగు పారుతుంది. అయితే 150 ఏళ్ల క్రితం నాటి నిర్మాణం కావడంతో బరాజ్‌లో భారీగా ఇసుక మేటలు వేశాయి. దీంతో బరాజ్ డెడ్ స్టోరేజీ లెవల్ 42 మీటర్లకు చేరుకోగా, నీటి నిల్వ సామర్థ్యం నాలుగు టీఎంసీలకు పడిపోయింది. ప్రస్తుతం 47.7 మీటర్ల ఎత్తులో 0.98 టీఎంసీల నీరే ఇక్కడ నిల్వ ఉంది.


