మొక్కజొన్న లోడు లారీని అడ్డుకున్న రైతులు
జూలూరుపాడు: మొక్కజొన్న కంకులు తీసుకెళ్తున్న లారీని జూలూరుపాడులో రైతులు శుక్రవారం అడ్డుకున్నారు. పంటకు డబ్బు చెల్లించకుండా విత్తన కంపెనీ బాధ్యులు జూలూరుపాడులోని ఓ వే బ్రిడ్జి వద్ద లారీలో లోడ్ చేసుకొని తీసుకెళ్తుండగా, చండ్రుగొండ మండలం పోకలగూడెం, గానుగపాడు, బాల్యాతండా, జూలూరుపాడు మండలం గంగారంతండాకు చెందిన రైతులు అడ్డగించారు. వివిధ కంపెనీల ఏజెంట్లు ఎకరాకు 4 – 5 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని చెప్పి, అలా జరగకపోతే రూ.75 వేలు పరిహారం ఇస్తామని నమ్మించినట్లు తెలిపారు. కానీ, పరిహారం చెల్లించకపోగా పండిన పంటకు డబ్బు చెల్లించకుండా తీసుకెళ్తున్నారని ఆరోపించారు. గ్రామాల నుంచి కంకులతో లారీని జూలూరుపాడు వే బ్రిడ్జి వద్దకు తీసుకొచ్చి, సాయంత్రం వరకు డబ్బు ఇవ్వకపోవడంతో అడ్డుకున్నామని తెలిపారు. పోలీసులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించగా, విత్తన కంపెనీలపై ఫిర్యాదు చేశారు. కాగా, రైతులను నమ్మించి మోసం చేసిన మొక్కజొన్న విత్తన కంపెనీ డీలర్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏఐయూకేఎస్ నాయకుడు బానోత్ ధర్మా డిమాండ్ చేశారు. రైతులు భూక్యా లక్ష్మణ్, వస్రాం, బాలు, మంగీలాల్, రాంబాబు, ప్రసాద్, వెంకటేశ్, ప్రశాంత్ పాల్గొన్నారు.


