బ్రహ్మోత్సవాలు ‘పరిపూర్ణం’ | - | Sakshi
Sakshi News home page

బ్రహ్మోత్సవాలు ‘పరిపూర్ణం’

Apr 13 2025 12:33 AM | Updated on Apr 13 2025 12:33 AM

బ్రహ్

బ్రహ్మోత్సవాలు ‘పరిపూర్ణం’

భద్రాచలం వద్ద గోదావరిలో

వైభవంగా చక్రస్నానం

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలో గత నెల 30న ప్రారంభమైన వసంత ప్రయుక్త నవాహ్నిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజైన శనివారం స్వామివారి సుదర్శన చక్రానికి చక్రస్నానం కమనీయంగా జరిపారు. సుదర్శన చక్రాన్ని, ఉత్సవమూర్తులను ప్రత్యేక పల్లకీలో మేళతాళాలు, వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ పవిత్ర గోదావరి వద్దనున్న పునర్వసు మండపం వద్దకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ మూర్తులకు మండపంలో స్నపన తిరుమంజనం, హారతి సమర్పించారు. అనంతరం గోదావరిలో సుదర్శన చక్రానికి సంప్రదాయబద్ధంగా చక్రస్నానం జరిపారు. సాయంత్రం ధ్వజావరోహణం, దేవతోద్వాసనం, ద్వాదశ ప్రదక్షిణలు, ద్వాదశారాధనలు నిర్వహించారు. యాగశాలలో పుష్పయాగం, పూర్ణాహుతిలతో బ్రహ్మోత్సవాలను పరిపూర్ణం చేశారు. సాయంత్రం శేష వాహనంపై స్వామివార్లను కొలువుదీర్చి తిరువీధి సేవ గావించారు. ఈ పూజల్లో ఆలయ అర్చకులు, పండితులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రామాలయంలో భక్తుల రద్దీ

వరుస సెలవుల నేపథ్యంలో శనివారం రామాలయంలో భక్తుల రద్దీ నెలకొంది. మూడు రోజుల సెలవులతోపాటు హనుమాన్‌ విజయోత్సవం సందర్భంగా పెద్ద సంఖ్యలో హనుమాన్‌ మాలధారులు భద్రగిరికి తరలివచ్చారు. పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం స్వామివారిని దర్శించుకోగా, మాలధారులు మాల విరమణ గావించారు. నేటి నుంచి నిత్యకల్యాణాలు, దర్బారు సేవలు తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా బేడా మండపంలో నిలిపివేసిన నిత్యకల్యాణాలు, దర్బారు సేవలు ఆదివారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. స్వామివారి నూతన పర్యంకోత్సవం ఈ నెల 22వ తేదీన జరపనున్నారు. పవళింపు సేవలు కూడా అదే రోజు నుంచి నిర్వహించనున్నారు. ఆదివారం చిత్తనక్షత్రం సందర్భంగా సుదర్శన హోమ పూజలను జరుపుతారు.

బ్రహ్మోత్సవాలు ‘పరిపూర్ణం’1
1/1

బ్రహ్మోత్సవాలు ‘పరిపూర్ణం’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement