ఆడపిల్లలు పుట్టారని అక్రమంగా దత్తత?
చింతకాని: మొదటి, రెండు కాన్పుల్లో ఆడపిల్లలు.. మూడో కాన్పులోనూ ఆడపిల్ల అని తెలియగా అబార్షన్ చేయించడమే కాక.. నాలుగో కాన్పులో కవల ఆడ శిశువుల జన్మించడంతో శిశువులను బంధువులకు దత్తత ఇచ్చిన ఘటన ఆలస్యంగా బయటపడింది. ఈ విషయం తెలిసి ఐసీడీఎస్ అధికారులు శిశువుల ఆచూకీపై ఆరా తీస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. చింతకాని మండలం నాగులవంచ రైల్వేకాలనీకి చెందిన నల్లగాజు మల్లేష్ – ఉమ దంపతులకు ఇప్పటికే ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. మూడో కాన్పులోనూ గర్భంలో ఆడపిల్ల పెరుగుతోందని తెలియగా ఉమ అబార్షన్ చేయించుకుంది. ఆ తర్వాత మళ్లీ గర్భం దాల్చగా గత నెల 31న ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కవల ఆడ శిశువులకు జన్మనిచ్చింది. దీంతో కవల శిశువులను ఆస్పత్రిలోనే ఉమ తన అక్కకు దత్తత ఇచ్చేసి ఇంటికి వచ్చారు. మూడు రోజుల క్రితం ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు కలిసి ఉమ, శిశువు ఆరోగ్య వివరాలు తెలుసుకునేందుకు ఆమె ఇంటికి వెళ్లగా శిశువులు కానరాలేదు. ఏమైందని ఆరా తీయగా పోషించలేకనే బంధువులకు దత్తత ఇచ్చామని బదులిచ్చారు. అనంతరం ఐసీడీఎస్ సీడీపీఓ కమలప్రియ, ఏసీడీపీఓ శివకుమారి, సూపర్‌వైజర్ పద్మావతి కలిసి మల్లేష్ ఇంటికి వెళ్లగా ఆయన ‘మా పిల్లలు మా ఇష్టం.. ఏమైనా చేసుకుంటాం.. అడగానికి మీరెవరు’ అంటూ దురుసుగా సమాధానం చెప్పారు. చట్టానికి లోబడి దత్తత ఇవ్వాలని, అలాకాకుండా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పడంతో మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో ఉంటున్న ఉమ అక్కకు పిల్లలను దత్తత ఇచ్చామని, సోమవారం వరకు తీసుకొస్తామని, లేనిపక్షంలో ఏ చర్యలైనా తీసుకోవచ్చని లేఖ రాసి ఇచ్చారు. కాగా, ఐసీడీఎస్ అధికారులకు వీడియో కాల్ ద్వారా కవల ఆడ శిశువులను చూపించారు.
ఆలస్యంగా బయటపడడంతో
అధికారుల విచారణ


