ట్రెంచ్ పనుల అడ్డగింత
ఇల్లెందురూరల్: మండలంలోని మర్రిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని ఎల్లాపురంలో ఆదివాసీలు, అటవీ శాఖ అధికారుల మధ్య మంగళవారం పోడు వివాదం చోటుచేసుకుంది. అధికారులు సోమవారం ట్రెంచ్ కొట్టే పనులు చేపట్టారు. ఆ పనులు కొనసాగించేందుకు మళ్లీ మంగళవారం వెళ్తుండగా గ్రామ పొలిమేరలోనే ఆదివాసీలు అడ్డుకున్నారు. తమకు పట్టాలున్న భూముల్లో ట్రెంచ్ పనులు ఎలా చేస్తారంటూ అధికారులను నిలదీశారు. అయితే తాము సాగు భూముల జోలికి వెళ్లడం లేదని, అడవికి సరిహద్దుగా మాత్రమే ట్రెంచ్ పనులు చేపట్టామని అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూముల వద్దకు వెళ్లనిచ్చేది లేదని భీష్మించడంతో అటవీ శాఖ అధికారులు వెనుదిరిగారు. అడవికి సరిహద్దుగా ట్రెంచ్ పనులు చేసుకోవాల్సిన అధికారులు.. ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు కలిగి ఉన్న భూముల్లోనూ పనులు చేపట్టారని ఆదివాసీలు ఆరోపించారు. కోతుల బెడద నుంచి పంటలను రక్షించుకునేందుకు ఒక రైతు చెట్ల కొమ్మలను నరికితే దీన్ని సాకుగా తీసుకుని పట్టా భూముల్లో ట్రెంచ్ పనులు చేపట్టడం అన్యాయమని అన్నారు. ఈ విషయమై కొమరారం ఇన్‌చార్జ్ ఎఫ్‌ఆర్‌ఓ చలపతిరావును వివరణ కోరగా.. పట్టా భూమి పక్కనే ఉన్న అడవిని కొందరు ఆక్రమించుకునే ప్రయత్నం చేసినట్లుగా గుర్తించామని, అడవికి, పట్టా భూములకు సరిహద్దును నిర్ధారించేందుకే ట్రెంచ్ పనులు చేపట్టామని చెప్పారు. తమ ప్రయత్నాన్ని గ్రామస్తులు అడ్డుకోవడం సరైంది కాదన్నారు.
ఎల్లాపురంలో పోడు వివాదం


