పాలక మండలికి మోక్షమెప్పుడో ?
జీఓ వచ్చి నెల కావొస్తున్నా
ప్రమాణస్వీకారం ఊసే లేదు
పాల్వంచరూరల్ : అమ్మవారు వరమిచ్చినా అధికారులు కరుణించని చందంగా ఉంది పెద్దమ్మతల్లి ఆలయ పాలక మండలి పరిస్థితి. ఆలయ పాలకమండలి కోసం 13 మంది పేర్ల జాబితాతో ప్రభుత్వం మార్చి 19న జీఓ నంబర్ 112 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. అయినా దేవాదాయ శాఖ అధికారులు ఇంకా ప్రమాణ స్వీకారానికి మోక్షం కల్పించడం లేదు. జీఓ వచ్చిన ఏడు రోజుల తర్వాత అంటే గత నెల 26న జాబితాలో పేర్లున్న వారందరనీ ప్రమాణస్వీకారోత్సవానికి ఈఓ ఆహ్వానించారు. దీంతో వారంతా ఆలయం వద్ద గల ఈఓ కార్యాలయానికి వెళ్లారు. అయితే స్థానికులకు కమిటీలో అవకాశం కల్పించాలంటూ ఇద్దరు యువకులు గుడి ఎదుట గల వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలపగా, మరి కొందరు ఈఓ కార్యాలయం ఎదుట అందోళన చేశారు. దీంతో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిలిచిపోయింది.
మొదట 14 మందితో..
పెద్దమ్మతల్లి ఆలయ పాలకవర్గం ఎన్నిక విషయంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ప్రభుత్వం రెండుసార్లు జీఓలు జారీ చేయడం వివాదానికి దారితీసింది. మొదట గతనెల 6వ తేదీన 14 మంది పేర్లతో జాబితా విడుదల చేశారు. అయితే ఈ కమిటీపై వివాదం తలెత్తడం, అధికారులు, మంత్రులకు ఫిర్యాదులు అందడంతో ఆ జీఓను రద్దుచేసి గతనెల 19న జీఓ నంబర్ 112 ద్వారా 13 మందితో కూడిన మరో జాబితా విడుదల చేశారు. ఇప్పుడు ఈ జీఓ వచ్చి కూడా 27 రోజులు కాగా, మరో మూడు రోజుల్లో ఈ జాబితా కూడా రద్దయ్యే అవకాశం ఉందని పాలకమండలిలో చోటు దక్కిన సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై ఆలయ ఈఓ రజినీకుమారిని వివరణ కోరగా.. పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించాలంటే ఉన్నతాధికారుల నుంచి మరోసారి ప్రొసీడింగ్స్ రావాల్సి ఉందని, రాగానే చేయిస్తామని చెప్పారు.


