రజతోత్సవ సభకు కదం తొక్కాలి
ఇల్లెందు: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న జరగనున్న బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ కోసం యావత్ దేశమే కాదు ప్రపంచంలోని తెలుగు వారంతా ఎదురుచూస్తున్నారని.. ఈ సభకు గులాబీ సైన్యం కదం తొక్కి విజయవంతం చేయాలని ఎంపీ వద్ది రాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. ఇల్లెందులో మంగళవారం నిర్వహించిన సన్నాహక సదస్సులో ఆయన మాట్లాడారు. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలన డొల్ల అని తేలడంతో తెలంగాణకు కేసీఆరే శ్రీరామ రక్ష అని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ఎవరెన్ని విమర్శలు చేసినా సూర్యచంద్రులు ఉన్నంత కాలం కేసీఆర్ పేరు తెలంగాణ చరిత్రలో ఉంటుందని చెప్పారు. హామీలేవీ అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వం.. తాగునీటి సరఫరా, ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ రజతోత్సవ సభకు పార్టీ శ్రేణులు తరలిరావాలని ఎంపీ కోరారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు మాట్లాడుతూ అధికారులు కాంగ్రెస్ నేతలకు వత్తాసుగా ఉంటే బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక చర్యలు తప్పవన్నారు. హనుమకొండ సభను బీఆర్‌ఎస్ శ్రేణులు పండుగగా భావించాలని సూచించారు. ఆ తర్వాత ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, దిండిగాల రాజేందర్ తదితరులు ఇల్లెందు 8వ వార్డులో ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి సభకు రావాలని ఆహ్వానించారు. ఇంకా ఈ సమాశంలో మహబూబాబాద్ జెడ్పీ మాజీ చైర్మన్ ఆంగోతు బిందు, సేవాలాల్ సేన వ్యవస్థాపకులు సంజీవనాయక్, లక్కినేని సురేందర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, గత ఎన్నికల్లో ఇల్లెందు టికెట్ ఆశించిన సేవాలాల్ సేన వ్యవస్థాపకుడు సంజీవనాయక్ ఈ సభకు హాజరుకావడం చర్చనీయాంఽశంగా మారింది.
సన్నాహక సదస్సులో ఎంపీ రవిచంద్ర
రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసింది కేసీఆరే..
దమ్మపేట : సాగునీటి ప్రాజెక్టులతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని ఎంపీ రవిచంద్ర అన్నారు. మండలంలోని పార్కలగండిలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పోరాడి తెలంగాణ తేవడం వల్లే నేడు రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని అన్నారు. అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ప్రజల విశ్వసనీయతను కోల్పోయిందని అన్నారు. మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఈనెల 27న నిర్వహించనున్న బీఆర్‌ఎస్ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న అధికారులు ఆ తర్వాత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ సభకు నియోజకవర్గం నుంచి 1000 మందిని తరలిస్తామని తెలిపారు. అనంతరం రజతోత్సవ సభ పోస్టర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు సోయం వీరభద్రం, సున్నం నాగమణి, వగ్గెల పూజ, రావు జోగేశ్వరరావు, దారా యుగంధర్, తూతా నాగమణి, దొడ్డా రమేష్, జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, దారా మల్లికార్జునరావు పాల్గొన్నారు.
రజతోత్సవ సభకు కదం తొక్కాలి


