పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట
పాల్వంచ: తమకు రక్షణ కల్పించాలని ఓ ప్రేమజంట బుధవారం పోలీసులను ఆశ్రయించింది. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని ఓ యువతి అదృశ్యంపై ఆమె తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా సదరు యువతి, పునుకుల గ్రామానికి చెందిన యువకుడు కలిసి పోలీసుస్టేషన్‌కు వచ్చారు. తాము ప్రేమించుకున్నామని, తమకు రక్షణ కల్పించాలని కోరారు. ఇద్దరు మేజర్లు కావడంతో పోలీసులు ఇరు కుటుంబాలను పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు.
మట్టి తరలింపుపై ఫిర్యాదు
చుంచుపల్లి: మండల పరిధిలోని బృందావనం వద్ద ప్రభుత్వ అభివృద్ధి పనులకు అనుమతులు తీసుకుని ఇతర అవసరాలకు మట్టిని తరలిస్తున్నారని బుధవారం స్థానికులు చుంచుపల్లి తహసీల్దార్ కృష్ణకు ఫిర్యాధు చేశారు. దీనిపై సిబ్బందితో విచారణ చేపట్టి నిజమని తేలితే చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు.
పదో తరగతి విద్యార్థిని అదృశ్యం
పాల్వంచరూరల్: ఐదు రోజుల క్రితం ఇంట్లో నుంచి రాత్రి సమయంలో బయటకు వెళ్లిన పదో తరగతి విద్యార్థిని అదృశ్యమైంది. పోలీసుల కథనం ప్రకారం... మండల పరిధిలోని ఉల్వనూరు గ్రామపంచాయతీలో ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసింది. ఈ నెల 11వ తేదీ రాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు పలు చోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. విద్యార్థిని తండ్రి బుధవారం ఫిర్యాదు చేయగా, అదృశ్యం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేష్ తెలిపారు.
ఇరువర్గాలపై కేసులు నమోదు
భద్రాచలంఅర్బన్: పట్టణంలోని శిల్పినగర్ కాలనీలో నెలకొన్న ఫ్లెక్సీ వివాదంలో బుధవారం ఇరువర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. శిల్పినగర్‌లో ఏర్పాటు చేసిన ఓ ఫెక్సీని చింపి వేసిన వేసిన ఘటనకు సంబంధించి ఇరువర్గాల వారు మాట్లాడుకుంటున్న సందర్భంలో మాటామాట పెరిగి పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో సుభాష్‌నగర్ కాలనీకి చెందిన రాహుల్‌తేజ్ అనే వ్యక్తి శిల్పినగర్‌కు చెందిన రఘుతోపాటు మరో ముగ్గురిపై ఫిర్యాదు చేశాడు. రాహుల్‌తేజ్‌పై కూడా రఘు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యం
టేకులపల్లి: ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యమైన ఘటనపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ అలకుంట రాజేందర్ కథనం ప్రకారం.. టేకులపల్లి పంచాయతీ రేగులతండా గ్రామానికి చెందిన ధరావత్ కవితకు మధిరకు చెందిన యువకుడితో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి 9, 7 సంవత్సరాల వయసు కలిగిన ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా సుమారు మూడు నెలల క్రితం కవిత తన ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వచ్చి ఇక్కడే ఉంటోంది. మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఇద్దరు పిల్లలను తీసుకుని బయటకు వెళ్లిపోయింది. పలుచోట్ల వెతికినా ఆచూకీ లేకపోవడంతో ఆమె తల్లి బాణోతు భామిని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గుండెపోటుతో మహిళ మృతి
అశ్వారావుపేటరూరల్: కాలినడకన వెళ్తున్న ఓ మహిళ అకస్మాత్తుగా కిందపడి మృతి చెందిన ఘటన అశ్వారావుపేటలో బుధవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఏపీలోని విజయవాడకు చెందిన ఎస్‌కే జరీనా(55) కొద్ది రోజుల క్రితం అశ్వారావుపేటలోని డ్రైవర్స్ కాలనీలో నివాసం ఉండే తన మరిది ఖలీల్ ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో బుధవారం తోటి కోడలితో కలిసి కూరగాయలు కొనేందుకు మార్కెట్‌కు వెళ్లింది. ఈ క్రమంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ప్రధాన రహదారిపై కుప్పకూలి పడిపోయింది. గమనించిన స్థానికులు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి గుండెపోటుకు గురై మృతి చెందిందని తెలిపారు.


