పార్కులపై పట్టింపేది? | - | Sakshi
Sakshi News home page

పార్కులపై పట్టింపేది?

Apr 22 2025 12:26 AM | Updated on Apr 22 2025 12:26 AM

పార్క

పార్కులపై పట్టింపేది?

నెహ్రూ పార్కుదీ అదే పరిస్థితి..

రామవరంలో ఉన్న నెహ్రూ పార్కును ప్రస్తుతం వనమా పార్కుగా పిలుస్తున్నారు. ఈ పార్కుకు అయితే తాళం కూడా తీయడం లేదని స్థానికులు చెబుతున్నారు. మరో రెండు రోజుల్లో వేసవి సెలవులు రానుండగా పార్కులోకి పిల్లలు వెళ్లే అవకాశం లేదని అంటున్నారు. పట్టణంలో పలు ఏరియాల్లో ఉన్న మినీ పార్కులు సైతం అధ్వానంగా మారాయి. ఇక పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని నవభారత్‌ పార్కు, బొల్లోరిగూడెం పార్కుల నిర్వహణ కొంత మేర బాగానే ఉంది. అయిఏ వీటిలోనూ చిన్నచిన్న సమస్యలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. మణుగూరు మున్సిపాలిటీలోని రాజుపేట్‌ ఏరియాలో ఉన్న చిల్డ్రన్‌ పార్కులోనూ సమస్యలు తాండవిస్తున్నాయి. పార్కు నిర్వహణ సక్రమంగా లేక స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలోని చెరువు కట్ట పార్కులో మున్సిపల్‌ సిబ్బంది ఎప్పటికప్పడు శుభ్రపరుస్తున్నారు. దీంతో ఇక్కడ సమస్యలు అంతగా లేవనే చెప్పాలి.

కొత్తగూడెంఅర్బన్‌: జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో ఉన్న పార్కులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. నిర్వహణ లేకపోవడంతో అధ్వానంగా మారాయి. పార్కుల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో సందర్శకులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారు లేరని వాపోతున్నారు. మున్సిపల్‌ నిధులు రూ.లక్షల్లో కేటాయిస్తున్నా పార్కులలో శాశ్వత సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు. మరో రెండు రోజుల్లో వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో పెద్దలతో కలిసి చిన్నారులు ఆడుకునేందుకు సమీప పార్కులకు వెళ్తుంటారు. అయితే వారి ఆటలకు సంబంధించిన పరికరాలు ఎక్కడా పని చేయడం లేదు. అవి తుప్పపట్టి, ముట్టుకుంటే చిన్నారుల చేతికి గాయాలయ్యే ప్రమాదం నెలకొంది. పార్కుల అభివృద్ధి, నిర్వహణకు రూ.లక్షలు కేటాయిస్తున్నట్లు పేపర్‌పై చూపించడమే తప్ప ఆచరణ లేదని, దీంతో సందర్శకులు అవస్థ పడాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలంలో అయినా అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు. ఇక నిర్వహణ లేకపోవడంతో ఎక్కడి చెత్త అక్కడే ఉంటోంది. నాటడానికి తీసుకొచ్చిన మొక్కలు ఎండి కళావిహీనంగా కనిపిస్తున్నాయి.

జిల్లా కేంద్రంలో ఇలా..

కొత్తగూడెంలో ప్రధానంగా రాజీవ్‌ పార్కు, రైటర్‌ బస్తీలోని పంచతంత్ర పార్కు, సింగరేణి చిల్డ్రన్‌ పార్కు, రామవరంలోని వనమా పార్కుతో పాటు పలు మినీ పార్కులు ఉన్నాయి. రాజీవ్‌ పార్కును 2005లో ఏర్పాటుచేయగా ఆది నుంచీ ఇక్కడ సమస్యలే ఉన్నాయి. వాకింగ్‌ ట్రాక్‌ మినహా మిగితావన్నీ మరమ్మతులకు గురయ్యాయి. పిల్లల ఆట పరికరాలు పని చేయడం లేదు. బాత్‌రూమ్‌లు వినియోగంలో లేవు. పార్కంతా పాముల పుట్టలు ఉండడంతో సందర్శకులు భయాందోళన చెందుతున్నారు. ఓపెన్‌ జిమ్‌లో పరికరాలు కొన్ని పని చేయడం లేదు. అండర్‌గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన వాటర్‌ ట్యాంకుపై కనీసం మూత కూడా లేక ప్రమాదకరంగా మారింది. పార్కు ఎంట్రన్స్‌లో ఉన్న ఫౌంటెన్‌ పని చేయడం లేదు. ఇక పంచతంత్ర పార్కు మరీ దారుణంగా మారింది. రూ.20 లక్షలతో నిర్మించిన ఈ పార్క్‌లో వాకింగ్‌ ట్రాక్‌, ఇతర ఆవరణంతా చెత్తతో నిండింది. ఓపెన్‌ జిమ్‌ పరికరాలు విరిగిపోయాయి. మున్సిపల్‌ అధికారులు పార్కు నిర్వహణను పట్టించుకోవడం లేదు. దీంతో సందర్శకులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

జిల్లాలో అధ్వానంగా మున్సిపల్‌ ఉద్యానవనాలు

పని చేయని ఓపెన్‌ జిమ్‌లు

అస్తవ్యస్తంగా వాకింగ్‌ ట్రాక్‌లు..

పట్టించుకోని పురపాలక అధికారులు

ఆట సామగ్రి కొత్తవి ఏర్పాటు చేయాలి

పార్కుల్లో పిల్లల ఆట సామగ్రి, పరికరాలు అన్నీ మరమ్మతులకు గురై ఉన్నాయి. కొన్ని అయితే తుప్పు పట్టి ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి. తుప్పు పట్టిన పరికరాలతో పిల్లలకు గాయాలయ్యే ప్రమాదం ఉంది. అధికారులు చర్యలు చేపట్టి నూతన పరికరాలను ఏర్పాటు చేయాలి.

– చిన్ని, గాజులరాజంబస్తీ

జిమ్‌ పరికరాలు మరమ్మతు చేయించాలి

రాజీవ్‌ పార్కులోని ఓపెన్‌ జిమ్‌లో ట్రైనీని ఏర్పాటు చేయాలి. జిమ్‌లో కొంత సామగ్రి మరమ్మతుకు గురైంది. దీంతో జిమ్‌ చేసే వారు ఇబ్బంది పడుతున్నాం. మరమ్మతు చేయించాలని మున్సిపల్‌ అధికారులను, స్థానిక ప్రజాప్రతినిధులను కోరినా పట్టించుకోవడం లేదు.

– రాజు, బూడిదగడ్డ, కొత్తగూడెం

పార్కులపై పట్టింపేది?1
1/3

పార్కులపై పట్టింపేది?

పార్కులపై పట్టింపేది?2
2/3

పార్కులపై పట్టింపేది?

పార్కులపై పట్టింపేది?3
3/3

పార్కులపై పట్టింపేది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement