
కొత్త ఫ్యాక్టరీ నిర్మిస్తాం
సిద్దిపేట ఫ్యాక్టరీలో ట్రయల్ రన్ ప్రారంభించాం త్వరలోనే కల్లూరిగూడెం ఫ్యాక్టరీ అందుబాటులోకి ఆయిల్‌ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి వెల్లడి
అశ్వారావుపేటరూరల్: అశ్వారావుపేట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ఏళ్లనాటిది కావడంతో కొన్ని సమస్యలు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో ఇక్కడ మరో ఫ్యాక్టరీ నిర్మిస్తామని ఆయిల్‌ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి తెలిపారు. ఆదివారం దమ్మపేట మండలంలోని అప్పారావుపేట, అశ్వారావుపేట ఫ్యాక్టరీలను, నారంవారిగూడెం నర్సరీని సందర్శించారు. అప్పారావుపేటలో ఉద్యోగులు, సిబ్బంది సమీక్ష జరిపారు. అశ్వారావుపేట ఫ్యాక్టరీలో బాయిలర్లు, గెలల క్రషింగ్, పవర్ ప్లాంట్‌ను తనిఖీ చేశారు. పనితీరుపై ఆరా తీశారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ ఏటా పెరుగుతున్న తోటల విస్తరణ, గెలల దిగుబడి దృష్ట్యా కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అశ్వారావుపేటలో కొత్త ఫ్యాక్టరీకి ఆయిల్‌బోర్డు మీటింగ్‌లో తీర్మానించేలా కృషి చేస్తానని తెలిపారు. ఖమ్మం జిల్లా కల్లూరిగూడెంలో నిర్మిస్తున్న ఫ్యాక్టరీ వచ్చే జూన్ నాటికి అందుబాటులోకి వస్తుందన్నారు. సిద్దిపేట ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి కాగా, గెలల క్రషింగ్ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నామని, త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు.
కొన్ని గెలలు సిద్దిపేటకు తరలిస్తున్నాం
ఫ్యాక్టరీలో గెలల క్రషింగ్ ఆలస్యం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని, ఖమ్మం జిల్లాలోని ముది గొండ, వైరా ప్రాంతాలతోపాటు మహబూబాబాద్ జిల్లాలోని మరికొన్ని మండలాల గెలలను సిద్దిపేట ఫ్యాక్టరీకి మళ్లించామన్నారు. కొత్తగా తోటల విస్తరణకు 10లక్షల మొక్కల్ని సిద్ధం చేశామన్నారు. మరో ఆరు నెలల్లో పొట్టి రకం మొక్కలు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు. ఆఫ్‌టైప్ మొక్కలతో నష్టం జరిగిన మాట వాస్తవమేనని, రాష్ట్రంలో 40వేల మంది రైతులు తోటలను సాగు చేస్తుంటే, 67 మంది రైతుల తోటల్లో ఆఫ్‌టైప్ మొక్కలు వచ్చాయని చెప్పుకొచ్చారు. ఆయిల్‌ఫెడ్‌కు రూ. 60 కోట్ల అప్పు ఉంటే, రూ.600 కోట్లు ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. టన్ను గెలల ధరను రూ.25వేలకు పెరిగేలా కృషి చేస్తున్నామని తెలిపారు.
ట్రాక్టర్‌ను నడిపిన ఆయిల్‌ఫెడ్ చైర్మన్
దమ్మపేట: మండలంలోని అప్పారావుపేట ఫ్యాక్టరీలో టీఎస్ ఆయిల్‌ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి ఆయిల్‌పామ్ గెలల లోడుతో ఉన్న ట్రాక్టర్‌ను నడిపి రైతులు, సిబ్బందిని ఉత్సాహపరిచారు. ఆదివారం ఫ్యాక్టరీని సందర్శించిన ఆయన రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. పామాయిల్ ట్రాక్టర్‌ను చైర్మన్ స్వయంగా నడుపుతూ, కాంటా పెట్టించిన అనంతరం ర్యాంప్ మీదుగా ప్లాట్‌ఫాం పైకి ఎక్కించి, గెలలను అన్‌లోడ్ చేయించారు. కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకుడు బండి భాస్కర్, ఆయిల్‌ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, డివిజనల్ మేనేజర్ రాధాకృష్ణ, ఫ్యాక్టరీ మేనేజర్లు కల్యాణ్, నాగబాబు పాల్గొన్నారు.
అశ్వారావుపేటలో మరో ఆయిల్‌పామ్ కర్మాగారం