
అక్రమాల అధికారి..?
సారు రూటే సప‘రేటు’
కమీషన్ల కక్కుర్తితో
ప్లాంట్ గౌరవానికి భంగం
‘సాక్షి’కథనాలతో
ఇంటెలీజెన్స్ అధికారుల ఆరా
విద్యుత్ సౌధ ఆదేశాల మేరకే
మణుగూరురూరల్: పినపాక నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించి, నిర్వహిస్తున్న విద్యుత్ కర్మాగారంలో తవ్వేకొద్ది అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. కమీషన్ల కక్కుర్తితో అవసరం లేని పనులకు రెండింతలు అంచనాలు వేపించడం.. వారి వద్ద నుంచి 15 – 25 శాతం ఓ అధికారి మామూళ్లు వసూలు చేస్తుండటంతో రాష్ట్రస్థాయిలో కీర్తి ప్రతిష్టలు సంపాదించాల్సిన కర్మాగారం పరువు దిగజారుతుండటంపై పలువురు బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. ఫైల్ కదలాలన్నా.. కాంట్రాక్ట్ దక్కాలన్నా, ఓపెన్ టెండర్‌లో లొసుగులు లీక్ చేయాలన్నా.. అడిగినంతా ఇచ్చుకోవాల్సిందేనని సమాచారం. అనర్హులకు టెండర్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తే అడిగిన టెండర్‌కు పోటీదారులను పెంచి ప్రశ్నించిన వారిని తొక్కేస్తారని బాధితులు చెబుతున్నారు. ‘సాక్షి’లో వచ్చిన వరుస కథనాలతో ఇంటెలీజెన్స్ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, ప్లాంట్‌లో పర్యటించినట్లు తెలిసింది.
అడుగడుగునా ఆరోపణలే..
కర్మాగారంలో అడుగడుగునా అవినీతి రాజ్యమేలుతోంది. తవ్వేకొద్ది అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కంపెనీకి ఫ్‌లైయాష్ కోసం వచ్చే లారీలకు కంపెనీ స్థలాన్ని పార్కింగ్ స్థలంగా కేటాయించే దగ్గరి నుంచి చిన్నాచితక నామినేటెడ్ కాంట్రాక్ట్‌లు కేటాయించే దాకా సారుకు అడిగినంతా ముట్టజెప్పాల్సిందేనని బంధువులు, కుటుంబ సభ్యుల ఖాతాలకు నగదు బదిలీ చేయాల్సిందేనని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. లేదంటే తనకు నచ్చింది చేస్తారని, పాత కాంట్రాక్టర్లు, తన సామాజిక వర్గానికి చెందిన అనుభవం లేనివారికి పనులు అప్పగించేస్తారని ప్లాంట్ వర్గాలు, కార్మికులు, కాంట్రాక్టర్లు గుసగుసలాడుతున్నారు.
● కర్మాగారం నుంచి విడుదలయ్యే ఫ్‌లైయాష్ తీసుకెళ్లేందుకు మొత్తం 11 కంపెనీలకు అనుమతి ఉండగా, అందులో 7 సిమెంట్ కంపెనీలు, నాలుగు ట్రేడింగ్ కంపెనీలున్నాయి. అయితే రోజూ ప్లాంట్ నుంచి విడుదలయ్యే ఫ్లైయాష్‌లో అధిక శాతం సిమెంట్ కంపెనీలకు కేటాయించాలని నిబంధన ఉంది. కానీ, స్థానికంగా కుదుర్చుకున్న మామూళ్ల ఒప్పందం ప్రకారం నాలుగు ట్రేడింగ్ కంపెనీలకు లారీకి రూ.100 – రూ.150 చొప్పున వాటా ఇచ్చే ఒప్పందంతో వేల టన్నుల లోడింగ్ కల్పిస్తున్నారని తెలుస్తోంది. ప్రతిఫలంగా ఓ అధికారికి ప్రతి నెలా 3వ తేదీన ఠంచనుగా మామూళ్లు ఇవ్వాల్సిందేననే ఆరోపణలున్నాయి.
● ప్లాంట్ ప్రారంభం నుంచి టెండర్ లేకుండా నిర్వహిస్తున్న క్యాంటీన్‌లో పనిచేసే వర్కర్లను సొంత పనులకు వాడుకుని నామమాత్రపు జీతాలు ఇచ్చి వారి అసలు జీతాలు విత్‌డ్రా చేసుకుంటున్న విషయం బహిరంగ రహస్యమే.
● 2022లో వసూళ్ల దందాపై ఓ కాంట్రాక్టర్ ఎదురుతిరగడంతో అతడిపై అధికారుల అండదండలతో మరో కాంట్రాక్టర్ దాడికి పాల్పడి హత్యా యత్నం చేయడం స్థానిక పీఎస్‌లో కేసు నమోదు లాంటి విషయాలు సంచలనం సృష్టించాయి.
● యాష్ కోసం వచ్చే వాహనాలకు పార్కింగ్ సదుపాయం కల్పించాల్సిన బాధ్యత ప్లాంట్‌పై ఉండగా, సమీపంలోని ఓ స్థలం కేటాయించేందుకు అధికారి రూ.లక్షల్లో లంచం తీసుకుని చక్రం తిప్పారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
● చెప్పులరిగేలా తిరుగుతున్న వీటీడీఏ సొసైటీల సభ్యులను కాదని ముడుపులు చెల్లించిన వారికి కట్టబెట్టిన కాంట్రాక్టులపై ఆదివాసీ సంఘాలు బహి రంగంగా ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టి బూడిద కేటాయింపుల్లో జరిగిన అక్రమాలను అధికారి బంధువు, కుటుంబ సభ్యుల బ్యాంకు వివరాలపై విచారణ చేపడితే అసలు విషయాలు బయటకొస్తాయని ప్రజా సంఘాలు, ఆదివాసీ సంఘాలు పేర్కొంటున్నాయి.
విద్యుత్ కర్మాగారంలో ఆయన చెప్పిందే వేదం..!
టెండర్ ప్రక్రియ ఉన్నతాధికారుల ఆధీనంలోనిది. ఇక్కడ కేవలం అమలు చేయడమే నా విధి. క్యాంటీన్ టెండర్ మార్పుపై పైఅధికారులకు రాతపూర్వకంగా పంపాం. బూడిద చెరువులో 64 లక్షల టన్నుల బూడిద ఉంది. ఎవరు వచ్చినా కేటాయిస్తాం. వాటిల్లో అక్రమాలు జరిగే అవకాశం లేదు.
– బిచ్చన్న, సీఈ