
న్యూఢిల్లీ: ఆధార్ ఆధారిత ఈకేవైసీ లావాదేవీలు సెప్టెంబర్ నెలకు 25.25 కోట్లుగా నమోదయ్యాయి. ఆగస్ట్ నెలతో పోలిస్తే ఇవి 7.7 శాతం పెరిగినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. నో యువర్ కస్టమర్ (కేవైసీ) అన్నది అన్ని ముఖ్య లావాదేవీలకు అవసరమని తెలిసిందే. పేపర్లతో సంబంధం లేకుండా ఆధార్ బయోమెట్రిక్‌తో ఈకేవైసీ విధానం పలు చోట్ల అమల్లో ఉన్న విషయం గమనార్హం.
ఆధార్ ఆధారిత పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్) సైతం ఆర్థిక సేవల విస్తృతికి కీలకమని ఈ ప్రకటన పేర్కొంది. ‘‘ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఏఈపీఎస్, మైక్రో ఏటీఎంల ద్వారా మారుమూల ప్రాంతాల్లో మొత్తం మీద 1,594 కోట్ల బ్యాంకింగ్ లావాదేవీలు నమోదయ్యాయి. సెప్టెంబర్ నెలలోనే 21.03 కోట్ల ఏఈపీఎస్ లావాదేవీలు దేశవ్యాప్తంగా జరిగాయి’’అని వెల్లడించింది. ఆధార్ ద్వారా సెప్టెంబర్ నెలలో 175.41 కోట్ల ధ్రువీకరణ లావాదేవీలు నమోదయ్యాయి.
చదవండి: షాపింగ్ బంద్, యూపీఐ లావాదేవీలు ఢమాల్.. ఏమయ్యా విరాట్ కోహ్లీ ఇదంతా నీ వల్లే!