న్యూఢిల్లీ: బ్యాంకులను దాదాపు రూ. 22,848 కోట్ల మేర మోసం చేసిన కేసులో ఏబీజీ షిప్‌యార్డ్ మాజీ చైర్మన్, ఎండీ రిషి అగర్వాల్‌ను సీబీఐ మరోసారి ప్రశ్నించింది. దీనికి సంబంధించిన విచారణ కోసం ఆయన సోమవారం హాజరయ్యారు. గతవారం కూడా ఆయన్ను ప్రశ్నించిన సీబీఐ .. నిధుల మళ్లింపు ఆరోపణల అంశంపై రాబోయే రోజుల్లో మరింత లోతుగా విచారణ జరపనున్నట్లు, రిషి అగర్వాల్ చెప్పే వివరాలను రికార్డు చేసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
నేపథ్యం
ఏబీజీ షిప్‌యార్డ్ సంస్థ ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర 28 బ్యాంకుల నుంచి గతంలో రుణాలు తీసుకుంది. 2012–2017 మధ్య కాలంలో నిందితులంతా కుమ్మక్కై .. నిధుల మళ్లింపు సహా పలు అక్రమ కార్యకలాపాలకు పాల్పడ్డారని కన్సల్టెన్సీ సంస్థ ఎర్న్‌స్ట్ అండ్ యంగ్ నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్‌లో వెల్లడైంది. 2020 ఆగస్టు 25న ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ ఫిర్యాదు చేసిన మీదట 2022 ఫిబ్రవరి 7న సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఆ వెంటనే ఫిబ్రవరి 12న 13 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఆరోపణలకు ఊతమిచ్చే పలు పత్రాలను, ఖాతాలను స్వాదీనపర్చుకుంది.
వీరిపై కేసులు
ఈ కేసులో అప్పటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతానం ముత్తస్వామి, డైరెక్టర్లయిన అశ్విని కుమార్, సుశీల్ కుమార్ అగర్వాల్, రవి విమల్ నెవెతియా తదితరులపై క్రిమినల్ కుట్ర, మోసం, విశ్వాస ఘాతుకం, అధికార దుర్వినియోగం మొదలైన అభియోగాలు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment