85.8% వాటాల కొనుగోలు
రూ. 400 కోట్ల ఎంటర్‌ప్రైజ్ విలువ
న్యూఢిల్లీ: ఏవియేషన్ మెయింటెనెన్స్, రిపేర్, ఓవరాల్ (ఎంఆర్‌వో) సర్విసుల దిగ్గజం ఎయిర్ వర్క్స్‌లో అదానీ గ్రూప్ 85.8 శాతం వాటాలు కొనుగోలు చేయనుంది. ఈ డీల్ కోసం సంస్థ విలువను రూ. 400 కోట్లుగా లెక్కించారు. ఇందుకు సంబంధించి అదానీ డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్ (ఏడీఎస్‌టీఎల్) షేర్ల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు అదానీ గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిర్ వర్క్స్ 35 నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 1,300 మంది పైగా సిబ్బంది ఉన్నారు. మెయింటెనెన్స్, ఇంటీరియర్ రీఫర్బిష్ మెంట్, పెయింటింగ్ మొదలైన సేవలు అందిస్తోంది.
భారతీయ నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కి కూడా సర్విసులు అందిస్తోంది. హోసూర్, ముంబై, కొచ్చిలో యూనిట్లు ఉన్నాయి. 20 పైగా దేశాల్లో సివిల్ ఏవియేషన్ నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు ఉన్నాయి. డిఫెన్స్ ఎంఆర్‌వో విభాగంలో అదానీ గ్రూప్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి ఈ కొనుగోలు తోడ్పడుతుందని అదానీ ఎయిర్‌పోర్ట్స్ డైరెక్టర్ జీత్ అదానీ తెలిపారు. భారత ఏవియేషన్ పరిశ్రమ ప్రస్తుతం అంతర్జాతీయంగా మూడో స్థానంలో ఉందని, రాబోయే రోజుల్లో 1,500 ఎయిర్‌క్రాఫ్ట్‌లను సమకూర్చుకుంటోందని వివరించారు. భారత ఎంఆర్‌వో సామర్థ్యాలను పటిష్టం చేయాలన్న తమ లక్ష్య సాధన దిశగా ఈ కొనుగోలు కీలక మైలురాయిగా ఉండగలదని అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సీఈవో ఆశీష్ రాజవంశి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment