
ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ ఇటీవల భారతదేశ విద్యా వ్యవస్థ ముఖచిత్రాన్ని మార్చే లక్ష్యంతో దాతృత్వ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. అందుకోసం దేశవ్యాప్తంగా కనీసం 20 పాఠశాలలను నిర్మించడానికి రూ.2,000 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇటీవల గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ, దివా షాల వివాహం సందర్భంగా రూ.10,000 కోట్లతో దాతృత్వ కార్యక్రమాలు ప్రారంభిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ప్రాథమికంగా పాఠశాలను ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొంది.
ఈ పాఠశాలల ఏర్పాటు కోసం అదానీ గ్రూప్ ఆధ్వర్యంలోని అదానీ ఫౌండేషన్ విద్య రంగంలో గ్లోబల్ లీడర్‌గా ఉన్న జెమ్స్ ఎడ్యుకేషన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు సరసమైన ఖర్చులతో ప్రపంచ స్థాయి విద్య, అభ్యసన మౌలిక సదుపాయాలను అందించడమే లక్ష్యంగా ఈ భాగస్వామ్యం కుదిరినట్లు ఇరువర్గాలు తెలిపాయి. 2025-26 విద్యా సంవత్సరంలో లఖ్‌నవూలో తొలి ‘అదానీ జెమ్స్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్’ ప్రారంభం కానుందని అదానీ గ్రూప్ స్పష్టం చేసింది.
మరిన్ని కార్యక్రమాల కోసం రూ.8 వేల కోట్లు
పాఠశాలలతో పాటు ఆస్పత్రుల నిర్మాణానికి రూ.6,000 కోట్లు, నైపుణ్యాభివృద్ధికి మరో రూ.2,000 కోట్లు ఇస్తామని అదానీ గ్రూప్ గతంలో ప్రకటించింది. ఈ ప్రయత్నాలు భారతదేశంలో అత్యంత నైపుణ్యం కలిగిన మానవ వనరులను సృష్టించే విస్తృత లక్ష్యంలో భాగమని కంపెనీ పేర్కొంది. సంస్థ పాఠశాలలను ప్రారంభిస్తుండడంపై గౌతమ్ అదానీ స్పందిస్తూ.. ప్రపంచ స్థాయి విద్యను చౌకగా, విస్తృతంగా అందుబాటులో ఉంచాలనే నిబద్ధతతో ఈ ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. జెమ్స్ ఎడ్యుకేషన్‌తో భాగస్వామ్యం ద్వారా సృజనాత్మక డిజిటల్ లెర్నింగ్‌ను అందుబాటులో ఉంచేందుకు వీలవుతుందని తెలిపారు.
ఇదీ చదవండి: పీఎన్‌బీలో రూ.271 కోట్ల ఫ్రాడ్
పెళ్లి సందర్భంగా నిర్ణయం
గౌతమ్ అదానీ (Gautam Adani) చిన్న కుమారుడు జీత్ అదానీ (Jeet Adani) వివాహం ఫిబ్రవరి 7న అంగరంగ వైభవంగా జరిగింది. దివా జైమిన్ షాను ఆయన పెళ్లాడారు. వివాహం సందర్భంగా ఈ నవ జంట స్ఫూర్తిదాయక ప్రతిజ్ఞ తీసుకున్నారు. ఏటా 500 మంది దివ్యాంగ వధువులకు రూ.10 లక్షలు చొప్పున సాయం అందించాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగానే అదానీ గ్రూప్ దాతృత్వ కార్యక్రమాలకు రూ.పదివేల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment