దేశీయంగా సిమెంట్ పరిశ్రమలో వేగంగా దివాలా చర్యలను ఎదుర్కొంటున్న జైప్రకాశ్(జేపీ) అసోసియేట్స్‌కు చెందిన జేసీ సిమెంట్స్‌ను అదానీ కొనుగోలు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అల్ట్రాటెక్, అదానీ గ్రూప్, దాల్మియా, జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ రంగంలో ఇప్పటికే భారీ ప్రణాళికలు అమలు చేస్తున్నాయి. సిమెంట్ తయారీలో అదానీ గ్రూప్.. దిగ్గజ కంపెనీలు ఏసీసీ, అంబుజాలోని ప్రధాన వాటాను కొనుగోలు చేసి దేశంలోనే రెండో పెద్ద సంస్థగా నిలిచింది. ఈ పరిశ్రమ అభివృద్ధిపై అదానీ గ్రూప్ ఎంతో ఆసక్తిగా ఉందని నిపుణులు చెబుతున్నారు. జేపీ సిమెంట్స్‌ను కూడా ఆ గ్రూప్ కొనుగోలు చేసే వీలుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జేపీ సిమెంట్స్ 9 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఒకవేళ ఈ కంపెనీని అదానీ కొనుగోలు చేస్తే అదానీ గ్రూప్ సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం పెరిగే అవకాశం ఉంటుంది.
ఇదీ చదవండి: వేడి టీ పడి ఒళ్లంతా గాయాలు.. రూ.12.5 కోట్ల దావా
జూన్ మొదటి వారంలో జేపీ గ్రూప్‌పై దివాలా చట్టం పరంగా చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్ ప్రణాళికలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఐసీఐసీఐ బ్యాంక్ దరఖాస్తు చేయడంతో అలహాబాద్‌లోని జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ) కోర్టు జేపీ అసోసియేట్స్‌పై దివాలా చట్ట ప్రక్రియను ప్రారంభించింది. జేపీ గ్రూప్ ఆధ్వర్యంలోని సిమెంట్ ఉత్పత్తికి ఉపయోగపడే లైమ్‌స్టోన్ గనులు, విద్యుత్ ప్లాంటుసహా సంస్థ ఆస్తులను పొందేందుకు అదానీ గ్రూప్ సన్నాహాలు మొదలు పెట్టే వీలున్నట్లు అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటివరకూ జేపీ ఆస్తుల విక్రయానికి ఎలాంటి ఆదేశాలు మాత్రం జారీకాలేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 2022, సెప్టెంబర్ 15 వరకు జేపీ గ్రూప్ అప్పులు రూ.6,893 కోట్లుగా ఉన్నట్లు తేలింది.
Comments
Please login to add a commentAdd a comment