న్యూఢిల్లీ: డీజిల్ వాహనాలపై మరింత పన్ను విధించాలంటూ కేంద్ర రహదారి శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. అయితే, అటువంటి యోచనేదీ ప్రభుత్వానికి లేదంటూ తర్వాత ఆయనే మళ్లీ వివరణ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది. వివరాల్లోకి వెడితే .. భారతీయ ఆటోమొబైల్ తయారీ సంస్థల సొసైటీ (సియామ్) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కాలుష్యం పెరిగిపోతుండటం ప్రజల ఆరోగ్యాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందంటూ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో డీజిల్ వాహనాలను అమ్మడం కష్టతరమయ్యేంత స్థాయిలో ప్రభుత్వం పన్నులు పెంచుతుందంటూ హెచ్చరించారు. వాటిపై అదనంగా 10 శాతం పన్ను విధించాల్సిన అవసరం ఉందని గడ్కరీ వ్యాఖ్యానించారు. ‘డీజిల్ ఇంజిన్లు/వాహనాలపై మరో 10 శాతం జీఎస్‌టీ విధించాలని నేను ఆర్థిక మంత్రిని కోరుతున్నాను. డీజిల్ వాహనాలను క్రమంగా తప్పించేసేందుకు ఇదొక్కటే మార్గం‘ అంటూ ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి తాను రాసిన లేఖను అందించేందుకు ఆర్థిక మంత్రితో సమావేశం కూడా కానున్నట్లు సూచనప్రాయంగా చెప్పారు.
యూటర్న్..
అయితే, గడ్కరీ ఆ తర్వాత తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ప్రభుత్వ వైఖరి గురించి వివరించారు. డీజిల్ వాహనాలపై అదనంగా 10 శాతం జీఎస్‌టీ విధింపును ప్రస్తావిస్తూ ‘అటువంటి ప్రతిపాదనేదీ ప్రభుత్వ పరిశీలనలో లేదు‘ అని సోషల్ మీడియా సైట్ ఎక్స్‌లో (గతంలో ట్విటర్)లో ఆయన స్పష్టం చేశారు. 2070 నాటికి కర్బన ఉద్గారాల విషయంలో తటస్థ స్థాయిని సాధించేందుకు, డీజిల్ వంటి హానికారక ఇంధనాల వల్ల తలెత్తే వాయుకాలుష్యాన్ని తగ్గించేందుకు స్వచ్ఛమైన, పర్యావరణ అనుకూలమైన ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగం పెరగాల్సిన అవసరం ఉందని గడ్కరీ చెప్పారు.
పర్యావరణహిత మొబిలిటీ వ్యవస్థ కావాలి: మోదీ
పర్యావరణానికి అనుకూలమైన, సుస్థిర ప్రయోజనాలు అందించే విధమైన రవాణా వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉందని సియామ్ సమావేశానికి పంపిన సందేశంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ’అమృత కాలం’ లక్ష్యాలను సాధించే దిశగా బాటలు వేయాలని దేశీ ఆటోమొబైల్ రంగానికి సూచించారు.
కోట్ల మందికి ఉపాధి కల్పించడం ద్వారా ఆదాయాల వృద్ధికి పరిశ్రమ తోడ్పడిందని ఆయన చెప్పారు. అదే సమయంలో ఆర్థిక వృద్ధితో పెరిగిన డిమాండ్‌తో పరిశ్రమ కూడా లబ్ధి పొందిందని మోదీ చెప్పారు. కర్బన ఉద్గారాలను తగ్గించే దిశగా ఆటోమొబైల్ రంగం వివిధ టెక్నాలజీలతో వాహనాలను ప్రవేశపెడుతోందని ఆయన ప్రశంసించారు. మోదీ సందేశాన్ని సియామ్ ప్రెసిడెంట్ వినోద్ అగర్వాల్ చదివి వినిపించారు.
Comments
Please login to add a commentAdd a comment