న్యూఢిల్లీ: వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి(ఏఐఎఫ్) పథకం కింద రూ.8,216 కోట్ల సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తులు వచ్చినట్టు కేంద్రం ప్రకటించింది. అత్యధిక దరఖాస్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చినట్టు తెలిపింది. దిగుబడి తర్వాత వ్యవసాయ ఉత్పత్తులకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేదుకు కేంద్ర సర్కారు ఈ పథకాన్ని తీసుకొచ్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమైన ఈ పథకం పదేళ్ల పాటు కొనసాగనుంది. దీని కింద బ్యాంకులు, ఆర్థిక సంస్థలు 3 శాతం వడ్డీ రాయితీపై మొత్తం రూ.లక్ష కోట్ల రుణాలను అందించనున్నాయి. గరిష్టంగా రూ.3 కోట్ల వరకు రుణాలపై ఈ మేరకు వడ్డీ రాయితీ అమలవుతుంది.
‘‘ఈ పథకం కింద ఇప్పటి వరకు 8,665 దరఖాస్తులు రూ.8,216 కోట్ల రుణాల కోసం వచ్చాయి. ఇందులో రూ.4,000 కోట్ల రుణాలు మంజూరయ్యాయి’’ అని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. అత్యధికంగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్) నుంచి రాగా, ఆ తర్వాత వ్యవసాయ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, రైతుల నుంచి వచ్చినట్టు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అత్యధికంగా 2,125 దరఖాస్తులు రాగా.. మధ్యప్రదేశ్ నుంచి 1,830, ఉత్తరప్రదేశ్ నుంచి 1,255, కర్ణాటక నుంచి 1,071, రాజస్థాన్ నుంచి 613 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపింది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment