సాక్షి, ముంబై: టాటా గ్రూప్ కంపెనీ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఖాతాలో కొత్తగా నాలుగు బోయింగ్ 737 రకం విమానాలు జతకూడనున్నాయి. కోవిడ్ సంక్షోభం తరువాత క్రమంగా ఆంక్షలు తొలగిపోతున్న నేపథ్యంలో విమానయాన రంగంలో డిమాండ్ పుంజుకుంది. ఈనేపథ్యంలోనే ఎయిరిండియా తాజా నిర్ణయం తీసుకుంది.
అంతర్జాతీయంగా ప్రయాణ అడ్డంకులు తొలగిపోయిన తర్వాత విదేశాలకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా అధికం అయిందని ఎయిరిండియా తెలిపింది. ఇప్పటికే సంస్థ వద్ద బోయింగ్ 737 విమానాలు 24 ఉన్నాయి. దీనికి మరో నాలుగు విమానాలు తోడు కావడంతో మొత్తం 28 విమానాలకు చేరనుంది.ఆగస్టు 2020లో కోజికోడ్ విమాన ప్రమాదంలో ఒక విమానాన్ని కోల్పోయింది.
అన్ని విమాన మార్గాలు మెరుగ్గా పనిచేస్తున్నాయని వివరించింది. ప్రయాణికుల సంఖ్య పరంగా కాలానుగుణ వ్యత్యాసాలు సహజమని తెలిపింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతం ప్రతిరోజు 100 సర్వీసుల ద్వారా భారత్‌లోని 13 విమానాశ్రయాలతోపాటు అంతర్జాతీయంగా 13 ఎయిర్‌పోర్టుల్లో ఎయిరిండియా విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment