కేరళలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దుబాయ్ నుంచి కాలికట్ విమానాశ్రయానికి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని శనివారం కొచ్చికి మళ్లించారు. 173 మంది ప్రయాణికులున్న ఈ విమానం తెల్లవారుజామున 2.47 గంటలకు కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది.
ఎయిర్‌పోర్ట్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం..నైరుతిరుతుపవనాల కారణంగా కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం తెల్లవారుజామున కురిసిన వర్షాలకు విమాన ప్రయాణాల్లో అంతరాయం ఏర్పడింది. దుబాయ్ నుంచి కాలికట్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం శనివారం తెల్లవారుజామున 2.47 సమయంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల కొచ్చిలో దిగింది. దాదాపు ఏడు గంటల తర్వాత ఉదయం 9.30 గంటలకు తిరిగి కాలికట్ విమానాశ్రయానికి బయలుదేరింది.
ఇదిలా ఉండగా, ఆగస్టు నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్-కోల్‌కతాకు రోజువారీ విమానాలు నడపనున్నట్లు ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రకటించింది. సంస్థ విడుదల చేసిన ప్రకటన ప్రకారం..దిల్లీ క్యాపిటల్ రీజియన్ నుంచి తక్కువ దూరంలో ఉన్న ఘజియాబాద్ హిండన్ విమానాశ్రయం నుంచి కోల్‌కతా వరకు రోజువారీ విమాన సర్వీసులను ప్రారంభించనున్నారు. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నుంచి ఈ సర్వీసులు మొదలవుతాయి.
ఇదీ చదవండి: నిమిషంలో మొబైల్..10 నిమిషాల్లో ఎలక్ట్రిక్ కారు ఫుల్‌ఛార్జ్..!
ఖాట్మండు, ఢాకాలను కూడా ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్ తన నెట్‌వర్క్‌లో చేర్చుకోనున్నట్లు ఇటీవల న్యూదిల్లీలో జరిగిన కాపా ఇండియన్ ఏవియేషన్ సమ్మిట్‌లో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అలోక్ సింగ్ పేర్కొన్నారు. ఈ విమానాల వివరాలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment