న్యూఢిల్లీ: 69 ఏళ్ల తర్వాత మళ్లీ ఎయిర్ ఇండియా టాటాల గూటికి గురువారం(జనవరి) నాడు చేరుతోంది. అధికారికంగా ఎయిర్ ఇండియాను నేడు టాటాలకు ప్రభుత్వం అప్పచెబుతోంది. ఎయిర్ ఇండియా పైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం బిడ్స్ పిలిచిన విషయం తెలిసిందే. అందరికంటే ఎక్కువగా రూ.18 వేల కోట్లకు టాటా గ్రూప్ బిడ్ వేసింది. టాటా గ్రూప్‌లో భాగమైన టాలేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ బిడ్‌ను దాఖలు చేసింది. దీంతో గత ఏడాది అక్టోబర్ 8న ఈ కంపెనీకే ఎయిర్ ఇండియా దక్కినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్‌నకు అమ్మేసినట్లు అక్టోబర్8న ప్రకటించిన మూడు రోజుల తర్వాత ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేసింది. అక్టోబర్ 25న టాటా గ్రూప్‌తో షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ (ఎస్పీఏ)ను ప్రభుత్వం కుదుర్చుకుంది. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి కావడంతో గురువారం టాటా గ్రూప్‌నకు ఎయిర్ ఇండియాను అప్పచెప్పనున్నట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. ఎయిర్ ఇండియాతోపాటు, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఎయిర్ ఇండియా ఎస్‌ఏటీఎస్‌లు కూడా టాటాల చేతికి రానున్నాయి. నష్టాలలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను ప్రైవేటు రంగానికి అప్పచెప్పాలని చాలా ఏళ్లుగా ప్రభుత్వం ప్రయత్నాలు జరుపుతోంది. ఎయిర్ ఇండియాలో నూరు శాతం వాటాను ప్రైవేటు రంగానికే ప్రభుత్వం ఇచ్చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment