అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (Jeff Bezos).. ఫ్లోరిడాలోని ప్రత్యేకమైన ‘బిలియనీర్ బంకర్’ దీవిలో మరో భవంతిని కొనుగోలు చేశారు. దాదాపు 156 బిలియన్ డాలర్ల నికర విలువతో ప్రపంచంలోనే మూడవ అత్యంత సంపన్నుడైన బెజోస్ సుమారు 79 మిలియన్ డాలర్లు (రూ.659 కోట్లు) పెట్టి దీన్ని కొన్నారు. కాగా రెండు నెలల ముందే ఇదే దీవిలో ప్రస్తుతం కొన్న మాన్షన్‌కు పక్కనున్న భవంతిని 68 మిలియన్ డాలర్లకు బెజోస్ కొనుగోలు చేశారు.
7 బెడ్‌రూమ్‌లు
అమెరికన్ రియల్ ఎస్టేట్ సంస్థ జ్లిలో (Zillow)లో ఈ ప్రాపర్టీ లిస్ట్ అయింది. అందులో పేర్కొన్న సమాచారం ప్రకారం.. ఈ భవంతిలో ఏడు పడక గదులు, 14 బాత్‌రూమ్‌లు ఉన్నాయి. ఈ మాన్షన్ విక్రయ ప్రక్రియ అక్టోబర్ 12న పూర్తయనట్లుగా పేర్కొన్నారు. ఈ భవంతి ధర 85 మిలియన్ డాలర్లు కాగా బెజోస్ 7.1 శాతం తగ్గింపుతో దక్కించుకున్నట్లు బ్లూమ్‌బర్గ్ నివేదిక ద్వారా తెలుస్తోంది.
2000 సంవత్సరంలో నిర్మించిన ఈ విశాలమైన 19,064 చదరపు అడుగుల నివాసం ఇండియన్ క్రీక్ ఐలాండ్ అని పిలిచే మానవ నిర్మిత ద్వీపంలో 1.84 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ ద్వీపం బిస్కేన్ బే శివార్లలో ఒక కోటగా నిలుస్తోంది. దీనికి సొంత మునిసిపాలిటీ, మేయర్, పోలీసు బలగాలు ఉన్నాయి. జిల్లో లిస్టింగ్ ప్రకారం.. ఈ భవంతిలో కొలను, థియేటర్, లైబ్రరీ, వైన్ సెల్లార్, మెయిడ్స్ క్వార్టర్స్, ఆవిరి స్నానాలు, ఆరు గ్యారేజ్ స్పేస్‌లు వంటి సౌకర్యాలు ఉన్నాయి.
ప్లాన్ అదేనా?
12 ఇండియన్ క్రీక్ ఐలాండ్ రోడ్ వద్ద నిర్పించిన ఈ విశాలమైన ఎస్టేట్.. గత ఆగస్ట్‌లో బెజోస్ కొనుగోలు చేసిన 68 మిలియన్ డాలర్ల ప్రాపర్టీకి పక్కనే ఉంది. ఈ ట్రిపుల్ బెడ్‌రూమ్ మాన్షన్‌ను తన గర్ల్‌ఫ్రెండ్ లారెన్ శాంచెజ్ కోసం కొన్నారు. బెజోస్ ఈ భవంతిని కూల్చివేసి మెగామాన్షన్‌ను నిర్మించాలని భావిస్తున్నాడు. అయితే తాజాగా కొన్న భవంతిని కూడా ఇలాగే చేస్తారా అన్నది తెలియరాలేదు.
జనాభా 81
ఇండియన్ క్రీక్ ఐలాండ్ దాదాపు 40 వాటర్ ఫ్రంట్ ప్రాపర్టీలకు నిలయం. ఈ ఐలాండ్‌లో 294 ఎకరాల విస్తీర్ణంలో గోల్ఫ్ కోర్సు ఉంది. విలాసవంతమైన ఓడల కోసం బ్రెజిలియన్ టేకు రేవులు ఇక్కడ ఉన్నాయి. బెజోస్ వద్ద ఉన్న 500 మిలియన్ డాలర్ల విలువైన సూపర్‌యాచ్ ‘కోరు’కు ఇది అనువైనది. అంతేకాకుండా ఇందులో హెలికాప్టర్ ల్యాండింగ్ ప్యాడ్, స్విమ్మింగ్ పూల్ వంటివి ఉన్నాయి.
2021 జనాభా లెక్కల ప్రకారం, ఈ ద్వీపం జనాభా కేవలం 81. ఇందులో సొంత భవంతులు ఉన్న ప్రముఖులలో టామ్ బ్రాడీ, ఇవాంకా ట్రంప్, జారెడ్ కుష్నర్, ఫిలడెల్ఫియా ఈగల్స్ మాజీ యజమాని నార్మన్ బ్రమన్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment