ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ దేశీయంగా క్విక్ కామర్స్ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది. ’15 నిమిషాల లోపే’ నిత్యావసరాలను డెలివరీ చేసేలా బెంగళూరులో పైలట్ ప్రాజెక్టును ఈ నెలలో మొదలుపెట్టబోతున్నట్లు అమెజాన్ ఇండియా కంట్రీ మేనేజర్ సమీర్ కుమార్ తెలిపారు. దేశీయంగా ఇప్పటికే క్విక్ కామర్స్ మార్కెట్లో బ్లింకింట్, జెప్టో మొదలైనవి విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
డేటమ్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం ప్రస్తుతం ఈ మార్కెట్ 6.1 బిలియన్ డాలర్లుగా ఉండగా 2030 నాటికి 40 బిలియన్ డాలర్లకు చేరొచ్చనే అంచనాలు ఉన్నాయి. మరోవైపు భారత్‌లో ఈ–కామర్స్ వృద్ధికి గణనీయంగా అవకాశాలు ఉన్నాయని కుమార్ వివరించారు. ఇక్కడ విక్రేతలు.. ఔత్సాహిక వ్యాపారవేత్తల సంఖ్య పెరుగుతుండటం, నాణ్యమైన తయారీ, సానుకూల పాలసీలు, టెక్నాలజీ మొదలైనవన్నీ ఇందుకు దోహదపడే అంశాలని పేర్కొన్నారు.
భారీ డిస్కౌంట్లతో చిన్న వ్యాపారాలను దెబ్బతీస్తోందంటూ అమెజాన్‌పై వచ్చే ఆరోపణల మీద స్పందిస్తూ.. తమ కంపెనీ కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా, నిబంధనల మేరకు వ్యాపారం నిర్వహిస్తోందని కుమార్ చెప్పారు. చిన్న, మధ్య స్థాయి వ్యాపారాలు కూడా మనుగడ సాగించేలా తోడ్పాటు అందించడమనేది ఒక పెద్ద కంపెనీగా తన బాధ్యతగా అమెజాన్ భావిస్తుందని పేర్కొన్నారు.
80 బిలియన్ డాలర్ల ఎగుమతులు
అమెజాన్ 2030 నాటికి భారత్ నుండి మొత్తం ఎగుమతులు 80 బిలియన్ డాలర్లకు చేర్చనున్నట్టు ప్రకటించింది. 2015 నుంచి కంపెనీ ఎగుమతులు చేపడుతోంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వం, లక్షలాది భారతీయ చిన్న వ్యాపారులు, డైరెక్ట్ టు కంజ్యూమర్ బ్రాండ్లతోపాటు ఇతర కీలక వాటాదారులతో కలిసి పనిచేస్తున్నట్టు అమెజాన్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఎస్‌వీపీ అమిత్ అగర్వాల్ తెలిపారు.
సంస్థ ఏటా నిర్వహించే సంభవ్ సదస్సు సందర్భంగా ఆయన మాట్లాడారు. 2030 నాటికి మొత్తం 80 బిలియన్ డాలర్ల ఎగుమతులను అందుకునేందుకు నిబద్ధతతో ఉన్నట్టు వివరించారు. 2015లో ప్రారంభించినప్పటి నుండి అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ భారత్‌లోని 200లకుపైగా నగరాల నుండి 1,50,000 పైచిలుకు నమోదిత విక్రేతలను కలిగి ఉందని చెప్పారు. 2025 చివరి నాటికి భారత్ నుండి మొత్తం ఎగుమతులు 20 బిలియన్ డాలర్లను అధిగమించబోతున్నాయని కంపెనీ బ్లాగ్ తెలిపింది.
గడువు కంటే ముందుగానే..
భారత్‌ను గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా స్థాపించడానికి డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ, ఇంటర్నల్ ట్రేడ్‌తో (డీపీఐఐటీ) అమెజాన్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. తయారీ స్టార్టప్స్‌లో 120 మిలియన్ డాలర్లు పెట్టుబడి చేయనున్నట్టు ప్రకటించింది. అమెజాన్ ఒక కోటి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను డిజిటలీకరణ చేస్తామని, 2025 నాటికి భారత్ నుండి మొత్తం 20 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులను సాధించి.. దేశంలో 20 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామని గతంలో హామీ ఇచ్చింది. గడువు కంటే ఏడాది ముందుగానే డిజిటలీకరణ లక్ష్యాన్ని పూర్తి చేసినట్టు అమెజాన్ తెలిపింది. 1.2 కోట్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల డిజిటలైజ్ చేశామని, మొత్తం ఎగుమతులు 13 బిలియన్ డాలర్లు నమోదయ్యాయని, 14 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు అందించామని వివరించింది.
లాజిస్టిక్స్ సేవలు..
దేశవ్యాప్తంగా వ్యాపార సంస్థలు, డైరెక్ట్ టు కంజ్యూమర్ (డీ2సీ) బ్రాండ్స్ కోసం అమెజాన్ షిప్పింగ్, అమెజాన్ ఫ్రైట్ పేరుతో సరుకు రవాణా సేవలను ప్రారంభించినట్లు అమిత్ అగర్వాల్ ప్రకటించారు. అమెజాన్ ఫ్రైట్ కింద నగరాల మధ్య, నగరాల్లో రవాణా కోసం పూర్తి ట్రక్‌లోడ్ సరుకు రవాణా సేవలను అందిస్తారు. అలాగే అమెజాన్ షిప్పింగ్ కింద బిజినెస్ టు కంజ్యూమర్ (బీ2సీ) పార్సిల్ డెలివరీలను చేపడతారు.
Comments
Please login to add a commentAdd a comment