న్యూఢిల్లీ: అమూల్ పాలు తొలిసారిగా విదేశీ మార్కెట్లలో లభించనున్నాయి. వారం రోజుల్లో అమెరికాలో అమూల్ పాలను ప్రవేశపెట్టనున్నట్లు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) ఎండీ జయేన్ మెహతా తెలిపారు. ‘మేము దశాబ్దాలుగా డెయిరీ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాం. కానీ తాజా పాలను భారత్ వెలుపల ప్రవేశపెట్టడం మాత్రం ఇదే ప్రథమం.
అమూల్ తాజా, గోల్డ్, శక్తి, స్లిమ్ ఎన్ ట్రిమ్ ఉత్పత్తులను వారం రోజుల్లో ప్రవేశపెడతాం‘ అని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం 108 ఏళ్ల చరిత్ర గల పాల సహకార సంఘం మిషిగాన్ మిల్క్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఎంఎంపీఏ)తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు వివరించారు. పాల సేకరణ, ప్రాసెసింగ్ ఎంఎంపీఏ చేపడుతుందని, అమూల్ బ్రాండ్ పేరిట మార్కెటింగ్ తమ సంస్థ చేపడుతుందని మెహతా చెప్పారు.
ముందుగా న్యూయార్క్, న్యూజెర్సీ, షికాగో, వాషింగ్టన్, డల్లాస్, టెక్సాస్ తదితర ప్రాంతాల్లో అమూల్ పాలు లభిస్తాయి. వచ్చే 3–4 నెలల్లో బ్రాండింగ్, మార్కెటింగ్‌పై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు మెహతా చెప్పారు. రాబోయే రోజుల్లో పనీర్, పెరుగు, మజ్జిగ వంటి ఉత్పత్తులను కూడా ప్రవేశపెడతామని తెలిపారు. జీసీఎంఎంఎఫ్ ఇప్పటికే 50 దేశాలకు పాల ఉత్పత్తలను ఎగుమతి చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment