సాక్షి,ముంబై: ద్రవ్యోల్బణం, రాకెట్ వేగంతో పెరుగుతున్న ఆహార ధరలతో కష్టాలు పడుతున్న సామాన్య జనానికి పండుగ సీజన్‌లో మరో షాక్ తగిలింది. అమూల్ పాల ధర లీటరుకు 2 రూపాయలు పెరిగింది. అకస్మాత్తుంగా శనివారం ఫుల్ క్రీమ్ మిల్క్ ధర లీటరుకు రూ.61 నుంచి రూ.63కి పెరిగడంతో షాకవ్వడం వినియోగదారుల వంతైంది. ఈ మేరకు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ ధరల పెంపును నిర్ణయించినట్టు తెలుస్తోంది.
పశువుల పెంపకంలో రైతులు ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పశుగ్రాసం, ఇతర ఖర్చులతో ఉత్పత్తి వ్యయం నిరంతరం పెరుగుతూ వస్తోంది. అయితే అమూల్‌ను మరో ఐదు సహకార సంఘాలతో విలీనం చేసి బహుళ-రాష్ట్ర సహకార సంఘం (ఎంఎస్‌సిఎస్) ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి, సహకార మంత్రి అమిత్ షా ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత ఈ పరిణామం జరిగింది.
మరోవైపు శుక్రవారం విడుదలైన టోకు ద్రవ్యోల్బణం డేటా ప్రకారం పశుగ్రాసం ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరింది. టోకు ద్రవ్యోల్బణం పశుగ్రాస ద్రవ్యోల్బణం రేటు 25 శాతానికి పైగానే ఉంది. కాగా గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ అమూల్ బ్రాండ్‌తో మార్కెట్ చేస్తుంది. సేకరణ ఖర్చుల పెరుగుదల నేపథ్యంలో అమూల్, మదర్ డెయిరీలు ఆగస్టులో 2 రూపాయలు చొప్పున పాలధరను పెంచిన సంగతి తెలిసిందే. మార్చిలో కూడా పాల ధరలు పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment