ఐఫోన్లతో యాపిల్‌- 2 ట్రిలియన్‌ డాలర్లకు | Apple becomes 2 trillion dollar company | Sakshi
Sakshi News home page

ఐఫోన్లతో యాపిల్‌-2 ట్రిలియన్‌ డాలర్లకు

Published Thu, Aug 20 2020 9:19 AM | Last Updated on Thu, Aug 20 2020 9:27 AM

Apple becomes 2 trillion dollar company - Sakshi

కోవిడ్‌-19 కారణంగా ఆర్థిక రికవరీ అత్యంత అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు ఫెడరల్‌ రిజర్వ్‌ తాజాగా పేర్కొంది. కరోనా వైరస్‌ సృష్టిస్తున్న కల్లోలంతో ఆర్థిక వ్యవస్థ అనూహ్య సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు అభిప్రాయపడింది. దీంతో రికవరీ బలహీనపడే వీలున్నట్లు అంచనా వేసింది. ఫలితంగా బుధవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాల నుంచి వెనకడుగు వేశాయి. ప్రస్తుతం ఫ్యూచర్స్‌లోనూ 0.7 శాతం నష్టంతో కదులుతున్నాయి. బుధవారం డోజోన్స్‌ 85 పాయింట్లు(0.3 శాతం) నీరసించి 27,693 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 15 పాయింట్లు(0.45 శాతం) క్షీణించి 3,375 వద్ద ముగిసింది. ఇక నాస్‌డాక్‌ 64 పాయింట్లు(0.6 శాతం) డీలాపడి 11,146 వద్ద స్థిరపడింది.

తొలి అమెరికన్‌ కంపెనీ
బుధవారం ట్రేడింగ్‌లో యాపిల్‌ షేరు ఇంట్రాడేలో దాదాపు 468 డాలర్లకు చేరింది. తద్వారా కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ తొలిసారి 2 లక్షల కోట్ల డాలర్లను తాకింది. వెరసి అమెరికన్‌ స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. చివరికి 463 డాలర్ల వద్ద ముగిసింది. దీంతో మార్కెట్‌ క్యాప్‌ 1.98 ట్రిలియన్‌ డాలర్లకు చేరింది. 2018 ఆగస్ట్‌ 2న తొలిసారి యాపిల్‌ మార్కెట్ విలువ 1 ట్రిలియన్‌ డాలర్లను తాకింది. తద్వారా ఈ ఫీట్‌ సాధించిన తొలి కంపెనీగా ఆవిర్భవించింది. తిరిగి ఈ జూన్‌లో  1.5 ట్రిలియన్‌ డాలర్లను అధిగమించింది. ఈ బాటలో ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌, టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ మార్కెట్‌ విలువ సైతం 1.5 ట్రిలియన్‌ డాలర్లను దాటడం గమనార్హం!

ఐఫోన్ల దన్ను
కంపెనీ కొంతకాలంగా ఐఫోన్లు, ఐప్యాడ్స్‌, వాచీలు, ఎయిర్‌పోడ్స్‌ అమ్మకాలతో జోరు చూపుతోంది. ఇటీవల యాపిల్‌ టీవీ+, యాపిల్‌ మ్యూజిక్‌ సర్వీసులను సైతం ప్రారంభించింది. కంపెనీ అమ్మకాల వృద్ధికి ప్రధానంగా ఐఫోన్‌ సహకరిస్తోంది. 2007లో అప్పటి సీఈవో స్టీవ్‌ జాబ్స్‌ హయాంలో తొలిసారి ఐఫోన్‌ను యాపిల్‌ విడుదల చేసింది. దీంతో కంపెనీ ఒక్కసారిగా స్పీడందుకుంది. స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ చరిత్రను ఐఫోన్‌ తిరగరాసినట్లు విశ్లేషకులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 2020లో ఇప్పటివరకూ యాపిల్‌ షేరు 57 శాతం దూసుకెళ్లడం విశేషం! 12 నెలల కాలాన్ని పరిగణిస్తే.. 120 శాతం ర్యాలీ చేసింది!

5జీ ఫోన్‌
ఇటీవల యాపిల్‌ తక్కువ ధరల శ్రేణిలో ఎస్‌ఈ మోడల్‌ ఐఫోన్లను విడుదల చేసింది. మరోవైపు ఐఫోన్‌ 12 పేరుతో 5జీ ఫోన్‌ విడుదల సన్నాహాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బాటలో మ్యాక్‌ ప్రొడక్టులకు సొంత చిప్‌లను వినియోగించే వ్యూహాలను అమలు చేస్తోంది. ఇలాంటి పలు అంశాలు యాపిల్‌ షేరుకి జోష్‌నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన చమురు దిగ్గజం సౌదీ అరామ్‌కో 2 ట్రిలియన్‌ డాలర్లను అందుకున్న కంపెనీగా ఇప్పటికే రికార్డ్‌ సాధించినప్పటికీ ప్రస్తుతం 1.8 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి చేరింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement