ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ కార్లతో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అందుకు అనుగుణంగా పలు దిగ్గజ ఆటోమొబైల్ సంస్థలతో పాటు స్మార్ట్ ఫోన్ కంపెనీలు సైతం ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసే పనిలో పడ్డాయి. యాపిల్, షావోమీ వంటి ప్రముఖ మొబైల్ పోన్ తయారీ కంపెనీలు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను తయారుచేస్తున్నాయనే వార్తలు ఇప్పటివరకు వచ్చాయి. అయితే తాజాగా యాపిల్ కంపెనీ తాను తయారుచేస్తున్న కార్లకు సంబంధించిన కీలక ప్రకటన చేసింది.
యాపిల్ తన ప్రతిష్టాత్మకమైన కారు ప్రాజెక్టును ఎట్టకేలకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అటానమస్ డ్రైవింగ్ సామర్థ్యం కలిగిన కారు విడుదల ప్రణాళికలను యాపిల్ పక్కన పెట్టింది. ఈ మేరకు గత దశాబ్దకాలంగా ‘టైటన్’ పేరిట పనిచేస్తున్న రహస్య ప్రాజెక్టుకు స్వస్తి పలికింది. ఈ విషయాన్ని అంతర్గత సమావేశంలో ఉద్యోగులకు ఇటీవల కంపెనీ తెలియజేసింది. ఈ విషయంపై ఇప్పటి వరకు యాపిల్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఈ ప్రాజెక్టులో పనిచేసిన సిబ్బందిని యాపిల్ ఇతర బాధ్యతల్లోకి బదిలీ చేయనుంది. వీరిలో మెజారిటీ సభ్యులు కృత్రిమ మేధ విభాగానికి పనిచేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. యాపిల్ 2014 నుంచి ఈ ప్రాజెక్టుపై పనిచేస్తోంది. కానీ, ఇప్పటి వరకు కారు ఎలా ఉంటుందో వెల్లడించలేదు. కానీ, సిలికాన్ వ్యాలీ రోడ్లపై దాన్ని పరీక్షించినట్లు పలుసార్లు వార్తలు వచ్చాయి. యాపిల్ వంటి సంస్థ ఇలాంటి కీలక ప్రాజెక్టును పక్కన పెట్టడంపై టెక్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
యాపిల్ కొత్త ఆవిష్కరణల్లో వెనకబడిందనే వాదన టెక్ వర్గాల్లో కొంతకాలంగా వినిపిస్తోంది. ఐఫోన్‌లలోనూ పెద్దగా మార్పులేమీ ఉండట్లేదనే విమర్శలు ఉన్నాయి. టిమ్‌కుక్ సారథ్యంలో కంపెనీ చెప్పుకోదగ్గ స్థాయిలో కొత్త ఉత్పత్తులను తీసుకురాలేదనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. గత ఐదు సంవత్సరాల్లో కంపెనీ పరిశోధన, అభివృద్ధిపై బిలియన్ డాలర్లు వెచ్చించినట్లు తెలిసింది.
ఇదీ చదవండి: గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్.. ఇకపై ఆ కష్టం తీరినట్టే..
2014లో యాపిల్ ఈ ‘ప్రాజెక్ట్ టైటాన్’ను తీసుకొచ్చింది. కానీ అంతర్గత కలహాలు, నాయకత్వ లోపాల కారణంగా యాపిల్‌కు ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయడం సాధ్యం కాలేదు. అందుకే 2016లో కార్ల తయారీకి స్వస్తి చెప్పింది. 2020లో మరోసారి ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 2022లో యాపిల్ సంస్థ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను వాహనదారులకు పరిచయం చేయనున్నట్లు మరోసారి తెలిపింది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment