సాక్షి, న్యూఢిల్లీ: అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన అప్టెరా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో భవిష్యత్తు అవసరాలకు తగిన విధంగా ఉండేలా అద్భుతమైన ఓ కార్ల మోడల్‌ను తీసుకొస్తోంది. గంటకు 110 మైళ్ల వేగంతో దూసుకెళ్లే ఈ కార్లను ఎన్నడూ 24 గంటల లోపల చార్జింగ్ చేయాల్సిన అవసరమే లేదట. కారుకు అమర్చిన సోలార్ పానెళ్లతో చార్జవుతూ కారు ముందుకు దూసుకెళుతుంది. రాత్రి ప్రయాణాల్లో సూర్య కిరణాలు తగలవు కనుక వెయ్యి మైళ్ల వరకు సునాయాసంగా తీసుకెళ్లే బ్యాటరీని దీనికి అమర్చారు. దాన్ని కూడా ప్రత్యేకంగా చార్జింగ్ చేయాల్సిన అవసరం లేదట. సోలార్ ప్యానెళ్ల సహకారంతో కారు నడుస్తున్నప్పుడే ఈ బ్యాటరీ చార్జవుతుందట. (చదవండి: టాటా మోటార్స్ ఉద్యోగులకు షాక్!)
సోలార్ కార్ల రంగంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన టెల్సా కంపెనీ మోడల్ కార్ల స్పేర్ బ్యాటరీతో 370 మైళ్లు మాత్రమే నడిచే అవకాశం ఉండగా, తమ మోడల్ సరికొత్త సోలార్ కారు వెయ్యి మైళ్ల వరకు బ్యాటరీ సహాయంతో దూసుకెళుతుందని కంపెనీ వర్గాలు ప్రకటించాయి. వెయ్యి మైళ్లు ఇచ్చే సోలార్ బ్యాటరీ చార్జింగ్ పూర్తిగా అయిపోతే లేదా ఐదారు రోజుల వరకు కారును బయటకు తీయకపోతే బ్యాటరీని చార్జి చేసుకోవాల్సిన అవసరం ఉంటుందట. రోజు ఈ కారును నడిపే వారికి ఎన్నడూ బ్యాటరీని చార్జి చేసుకోవాల్సిన అవసరం లేదని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కారు ఖరీదు 26 వేల డాలర్లు (దాదాపు 19 లక్షల రూపాయలు). ఇందులో ఖరీదైన మోడళ్లు 47 వేల డాలర్ల (దాదాపు 35 లక్షల రూపాయలు) వరకున్నాయి. ఈ కార్లు మూడున్నర క్షణాల్లోనే జీరో వేగం నుంచి గంటకు 60 కిలోమీటర్ల వేగాన్ని పుంజుకుంటుందట. డిసెంబర్ నాలుగవ తేదీ నుంచే ప్రీ లాంచింగ్ బుకింగ్‌ను ప్రారంభించగా, నేటికి పలు కార్లు బుక్కయ్యాయట. (చదవండి: పరిశ్రమలు రయ్‌రయ్..!)
Comments
Please login to add a commentAdd a comment