వచ్చే 3–5 ఏళ్లలో హై–ఎండ్ కంప్యూటింగ్ చిప్‌సెట్లయిన జీపీయూలను భారత్ సొంతంగా తయారు చేసుకోగలదని కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ధీమా వ్యక్తం చేశారు. అలాగే దేశీయ ఫౌండేషనల్ ఏఐ (AI) ప్లాట్‌ఫాం పది నెలల్లో సిద్ధం కావచ్చని వివరించారు. దేశీయంగా మరో 3–4 రోజుల్లో మొత్తం 18,000 అధునాతన గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లను (GPU) అందుబాటులోకి తేనున్నట్లు బడ్జెట్ రౌండ్‌టేబుల్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి చెప్పారు.
ఇప్పటికే 10,000 జీపీయూలు అందుబాటులో ఉన్నట్లు వివరించారు. ఖరీదైన, అధునాతన కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలు అవసరమయ్యే ఏఐ మోడల్స్ సాధారణంగా బడా సంస్థలకే పరిమితమయ్యే అవకాశం ఉందని, కానీ చిన్న స్థాయి అంకురాలు, పరిశోధకులు కూడా చౌకగా కంప్యూటింగ్ ఇన్‌ఫ్రాను ఉపయోగించుకునేందుకు వీలుగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుందని మంత్రి చెప్పారు. ఏఐ ఫౌండేషనల్ మోడల్‌ను రూపొందించేందుకు స్టార్టప్‌లు, పరిశోధకులు కీలకమైన మాథమెటికల్ అల్గోరిథంలకు సంబంధించిన పలు పరిశోధన పత్రాలను అధ్యయనం చేస్తున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి: బెదిరింపులకు భయపడి మూసేయలేదు
చాట్‌జీపీటీతో పోలిస్తే చిన్నవే అయినప్పటికీ పలు అంకుర సంస్థలు కొన్ని ఏఐ మోడల్స్‌ను ఇప్పటికే రూపొందించాయని, కృత్రిమ మేథ సహాయంతో రైల్వే శాఖ టికెట్ల కన్ఫర్మేషన్ రేటును 27 శాతం మెరుగుపర్చుకున్నట్లు మంత్రి తెలిపారు. మరోవైపు, దేశీ ఎల్రక్టానిక్ కంపెనీలు అత్యంత నాణ్యత, కచ్చితత్వంతో ఉత్పత్తులను తయారు చేసే సామర్థ్యాలను సాధించాయని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment