కోవిడ్-19 ఆందోళనల నుంచి బయటపడిన దేశీ స్టాక్ మార్కెట్ల బాటలో ప్రసిద్ధ ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా పోర్ట్‌ఫోలియో సైతం దూకుడు చూపుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ చివరివరకూ చూస్తే.. మిడ్, స్మాల్ క్యాప్స్‌తో కూడిన ఆశిష్ పోర్ట్‌ఫోలియో ఏకంగా 100 శాతంపైగా ర్యాలీ చేసింది. ఇదే కాలంలో మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 29 శాతమే పుంజుకుంది. తద్వారా మార్కెట్లను మించిన రిటర్నులను ఆశిష్ చిన్న షేర్ల పోర్ట్‌ఫోలియో సాధిస్తోంది. వివరాలు చూద్దాం..
పలు స్మాల్ క్యాప్స్
కచోలియా పోర్ట్‌ఫోలియోలోని మధ్య, చిన్నతరహా కౌంటర్లలో మజెస్కో, పౌషక్, రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్, విష్ణు కెమికల్స్ 100 శాతంపైగా ర్యాలీ చేశాయి. సుమారు 12 మిడ్, స్మాల్ క్యాప్స్‌లో ఆశిష్‌కు 1 శాతంపైగా వాటాలున్నాయి. ఇలాంటి 16 స్టాక్స్‌లో జూన్ చివరికల్లా 13 కౌంటర్లు భారీగా లాభపడగా.. సఫారీ ఇండస్ట్రీస్, డీఎఫ్‌ఎం ఫుడ్స్, ఎన్‌ఐఐటీ మాత్రం నీరసించాయి.
90 శాతం
ఆశిష్ స్టాక్స్‌లో హెచ్‌ఎల్‌ఈ గ్లాస్‌కోట్, కేపీఐటీ టెక్నాలజీస్, బిర్లాసాఫ్ట్ 90 శాతం దూసుకెళ్లగా.. అపోలో ట్రైకోట్, షాయిలీ ఇంజినీరింగ్, పాలీ మెడిక్యూర్, వైభవ్ గ్లోబల్ 87-70 శాతం మధ్య ఎగశాయి. ఈ 16 స్టాక్స్‌లో ఆశిష్ నెట్‌వర్త్ గత నాలుగు నెలల్లో 66 శాతం జంప్‌చేసి రూ. 494 కోట్లను తాకింది. మార్చికల్లా ఈ పోర్ట్‌ఫోలియో విలువ రూ. 298 కోట్లుగా నమోదైంది.
పౌషక్ స్పీడ్
ఏప్రిల్ నుంచి చూస్తే స్పెషాలిటీ కెమికల్ కంపెనీ పౌషక్ అత్యధికంగా 137 శాతం లాభపడింది. ఈ కంపెనీలో ఆశిష్‌కు 1.39 శాతం వాటా ఉంది. ఇక 3.1 శాతం వాటా కలిగిన ఐటీ సేవల కంపెనీ మజెస్కో 101 శాతం ర్యాలీ చేసింది. ఈ రెండు షేర్లూ నేటి ట్రేడింగ్‌లో 52 వారాల గరిష్టాలను తాకడం విశేషం! గత వారం యూఎస్ అనుబంధ సంస్థను పీఈ కంపెనీ థోమా బ్రావోకు విక్రయించనున్నట్లు వెల్లడించడంతో వరుసగా 7వ సెషన్‌లోనూ మజెస్కో షేరు అప్పర్ సర్క్యూట్‌కు చేరడం గమనార్హం! యూఎస్ అనుబంధ సంస్థ విక్రయంతో మజెస్కో పన్నుల తదుపరి నికరంగా రూ. 2555 కోట్ల నగదును పొందనున్నట్లు తెలుస్తోంది. దీంతో నగదు నిల్వలు పెరగడం ద్వారా బ్యాలన్స్‌షీట్ మరింత బలపడనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment