న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ సంస్థ బంధన్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికం(క్యూ1)లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం వార్షికంగా 19 శాతం క్షీణించి రూ. 721 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 887 కోట్లు ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం సైతం రూ. 2,514 కోట్ల నుంచి రూ. 2,491 కోట్లకు స్వల్పంగా నీరసించింది.
మొత్తం ఆదాయం మాత్రం రూ. 4,385 కోట్ల నుంచి రూ. 4,908 కోట్లకు ఎగసింది. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 7.25 శాతం నుంచి 6.76 శాతానికి తగ్గాయి. అయితే నికర ఎన్‌పీఏలు 1.92 శాతం నుంచి 2.18 శాతానికి పెరిగాయి. నికర వడ్డీ మార్జిన్లు 8 శాతం నుంచి 7.3 శాతానికి వెనకడుగు వేశాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 19.44 శాతంగా నమోదైంది. డిపాజిట్లు రూ. 1.08 లక్షల కోట్లను తాకగా.. అడ్వాన్సులు(రుణాలు) రూ. 1.03 లక్షల కోట్లకు చేరినట్లు బ్యాంక్ ఎండీ, సీఈవో చంద్రశేఖర్ ఘోష్ వెల్లడించారు.
ఫలితాల నేపథ్యంలో బంధన్ బ్యాంక్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 2.5 శాతం ఎగసి రూ. 221 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment