పిల్లులను, కుక్కలను పెంచుకోవడం చాలామందికి సరదా. అయితే, వాటిని పెంచుకోవడం అంత తేలికైన పని కాదు. వేళకు వాటికి అన్ని సేవలూ చెయ్యాలి. ముఖ్యంగా వాటికి స్నానం చేయించడం పెద్ద ప్రహసనమే! స్నానం చేయించాక, వాటిని తువ్వాలుతో తుడిచేస్తే తేలికగా ఆరిపోవు. ఒంటినిండా రోమాలతో ఉండే పెంపుడు జంతువులను స్నానం తర్వాత పొడిగా తయారు చేయడానికి కొందరు సాధారణ హెయిర్ డ్రైయర్లను వాడుతున్నారు.
హెయిర్ డ్రైయర్ల నుంచి వెలువడే శబ్దానికి పెంపుడు జంతువులు బెదిరిపోతాయి. ముద్దుగా పెంచుకునే పెంపుడు జంతువులకు, వాటి యజమానులకు ఎలాంటి సమస్య లేనివిధంగా ఉపయోగపడే స్మార్ట్ పెట్‌డ్రైయర్ అందుబాటులోకి వచ్చింది. ఘనాకారంలో డబ్బా మాదిరిగా ఉండే ఈ డ్రైయర్‌లో పిల్లులు, కుక్కపిల్లలు సుఖంగా కూర్చునేందుకు తగిన చోటు ఉంటుంది.
ఇందులో అన్ని వైపుల నుంచి వెలువడే వెచ్చని గాలికి అవి ఇట్టే పొడారిపోతాయి. ‘డ్రైబో ప్లస్’ పేరిట దొరుకుతున్న ఈ స్మార్ట్ పెట్‌డ్రైయర్ ధర సైజును బట్టి 599–749 డాలర్లు (సుమారు రూ.50 వేల నుంచి 62 వేలు) ఉంటుంది. ప్రస్తుతం ఇది అమెరికా, ఆస్ట్రేలియా మార్కెట్లలో అందుబాటులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment