కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం(కేఐఏ)లో పికప్ లేన్‌ల ప్రవేశ రుసుమును రద్దుచేస్తూ బెంగుళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్(బీఐఏఎల్) ప్రకటన విడుదల చేసింది. విమానాశ్రయ పరిధిలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు స్పీడ్ ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పింది.
అవసరం ఉన్నా, లేకపోయినా కేఐఏ పికప్‌లేన్ పరిధిలోకి పెద్దసంఖ్యలో వాహనాలు వస్తూండడం బీఐఏఎల్ దృష్టికి వెళ్లింది. దాంతోపాటు ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో భారీగా వాహనాలు చేరుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని గమనించింది. వాటిని నివారించాలంటే కొన్ని మార్పులు తీసుకురావాలని భావించింది. బీఐఏఎల్ టెర్మినల్ 1, 2లో అరైవల్ పికప్ లేన్‌లను చేరడానికి ఎంట్రీ ఫీజును ప్రవేశ పెట్టింది. రిజిస్ట్రేషన్ ప్లేట్ల ఆధారంగా వాహనాలపై ఛార్జీలు వసూలు చేస్తామని చెప్పింది. అయితే ఈ నిర్ణయం వెలువడిన కొన్ని గంటల్లోనే ట్యాక్సీడ్రైవర్లు, ఇతర కమ్యునిటీల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. దాంతో ప్రవేశ రుసుమును రద్దుచేస్తున్నట్లు బీఏఐఎల్ తిరిగి ప్రకటన విడుదల చేసింది.
బీఐఏఎల్ ముందుగా చేసిన ప్రకటన ప్రకారం..ప్రైవేట్ వాహనాలు పికప్ లేన్‌లలోకి ప్రవేశించిన ఏడు నుంచి 14 నిమిషాల సమయానికి రూ.150 రుసుము చెల్లించాలి. వాణిజ్య వాహనదారులు మొదటి ఏడు నిమిషాలకు రూ.150, తర్వాతి ఏడు నిమిషాలకు రూ.300 చెల్లించాలి. బస్సు ప్రయాణికులు ఏడు నిమిషాలకు రూ.600, ట్రావెలర్స్ రూ.300 చెల్లించాలని నిర్ణయించారు. ఒకవేళ టికెట్‌పోతే రూ.600 నిర్ణీత రుసుము చెల్లించాలి. పికప్ ఏరియాలో 15 నిమిషాలకు మించి ఉంటే ఆ వాహనాలను యజమాని ఖర్చుతో పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాలి.
వైట్ రిజిస్ట్రేషన్ ప్లేట్ కలిగి ఉండే వాహనాలను ప్రైవేట్ వాహనాలుగా, ట్రావెల్స్, ఆన్‌లైన్ బుకింగ్ వెహికిల్స్, పసుపు రిజిస్ట్రేషన్ ప్లేట్‌తోపాటు కొన్ని ఈవీలను వాణిజ్య వాహనాలుగా వర్గీకరించారు. కర్ణాటక రాష్ట్ర ట్రావెల్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాధాకృష్ణ హోల్లా మాట్లాడుతూ..‘ఎయిర్‌పోర్ట్ రావాలనుకునే ప్రయాణికులు ఇప్పటికే సాదహళ్లి టోల్‌గేట్ వద్ద ఛార్జీ చెల్లిస్తున్నారు. మళ్లీ అరైవల్-పికప్ ఏరియాలో రుసుము చెల్లించాలనే నిర్ణయం సరికాదు’ అన్నారు.
కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పరిధిలో ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడానికి బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ (బీడీఏ) స్పీడ్ ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఈ కెమెరాలు నిబంధనల కంటే వేగంగా వెళ్లే వారిని గుర్తించి జరిమానాలను విధిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment