
న్యూఢిల్లీ: ప్రతికూల స్థూలఆర్థిక పరిణామాలను ఎదుర్కొని నిలబడేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే కొందరు ఉద్యోగులను తీసివేయక తప్పడం లేదని ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ సీఈవో బైజు రవీంద్రన్ తమ సిబ్బందికి పంపిన సందేశంలో వివరణ ఇచ్చారు. కార్యకలాపాలను వేగంగా విస్తరించడంతో ఒకే రకం విధులను పలువురు ఉద్యోగులు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొందని, అలాంటి డూప్లికేషన్‌ను తగ్గించుకునేందుకు ఈ ప్రక్రియ చేపట్టాల్సి వచ్చిందన్నారు. నిలకడగా వృద్ధి సాధించడంతో పాటు ఈ ఆర్థిక సంవత్సరంలోనే గ్రూప్ స్థాయిలో లాభాలు ఆర్జించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నందున కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదని పేర్కొన్నారు.
‘సంస్థ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఎంతో భారమైన హృదయంతో ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ ప్రక్రియ సజావుగా జరగడంలో ఏవైనా ఆటంకాలు ఎదురైతే క్షమించండి. కంపెనీని నిలకడైన వృద్ధి బాట పట్టించి మిమ్మల్ని తిరిగి తెచ్చుకోవడమే నా మొదటి ప్రాధాన్యంగా ఉంటుంది‘ అని రవీంద్రన్ పేర్కొన్నారు. తొలగించే ఉద్యోగులకు మెరుగైన పరిహార ప్యాకేజీని ఇవ్వడంతో పాటు ఇతర ఉద్యోగాన్వేషణలోనూ కంపెనీ తోడ్పాటు అందిస్తుందన్నారు. ఆరు నెలల్లో దాదాపు 2,500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నామంటూ బైజూస్ ఇటీవల వెల్లడించిన నేపథ్యంలో రవీంద్రన్ లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment