బైజూస్‌ చేతికి టాపర్‌ టెక్‌! | Byjus nears 150 cr dollers acquisition of Edtech rival Toppr | Sakshi
Sakshi News home page

బైజూస్‌ చేతికి టాపర్‌ టెక్‌!

Published Tue, Feb 16 2021 6:19 AM | Last Updated on Tue, Feb 16 2021 6:19 AM

Byjus nears 150 cr dollers acquisition of Edtech rival Toppr - Sakshi

ముంబై: ఈలెర్నింగ్‌ స్టార్టప్‌ బైజూస్‌ తాజాగా ప్రత్యర్థి సంస్థ టాపర్‌ టెక్నాలజీస్‌ను కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈలెర్నింగ్‌ స్టార్టప్స్‌లో అతిపెద్ద సంస్థగా ఎదిగిన బైజూస్‌ ఎడ్యుటెక్‌ విభాగంలో కార్యకలాపాలు కలిగిన టాపర్‌ టెక్నాలజీస్‌పై కన్నేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ మెటీరియల్స్‌ అందించే టాపర్‌ను సొంతం చేసుకునేందుకు 15 కోట్ల డాలర్లు(దాదాపు రూ. 1,100 కోట్లు) వెచ్చించనున్నట్లు అంచనా. 5–12 క్లాసుల విద్యార్ధులకు టాపర్‌ మెటీరియల్స్‌ సరఫరా చేస్తోంది. టాపర్‌కు సయిఫ్‌ పార్టనర్స్, హెలియన్‌ వెంచర్స్‌ ఆర్థిక మద్దతునిస్తున్నాయి.

కొనుగోళ్ల జోరు
కోవిడ్‌–19 నేపథ్యంలో కొద్ది రోజులుగా ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌కు డిమాండ్‌ భారీగా పెరిగింది. దీంతో డిమాండును అందుకునే బాటలో బైజూస్‌ ఇటీవల ఇతర కంపెనీలను కొనుగోలు చేయడంపై దృష్టి సారించింది. దీనిలో భాగంగా జనవరిలో ఆకాష్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ను సొంతం చేసుకునేందుకు బిలియన్‌ డాలర్ల(సుమారు రూ. 7,300 కోట్లు) డీల్‌ను కుదుర్చుకుంది. కాగా.. బైజూస్‌– టాపర్‌ డీల్‌పై రెండు కంపెనీల ప్రతినిధులూ స్పందించకపోవడం గమనార్హం!

2011లో షురూ
బెంగళూరు కేంద్రంగా 2011లో ప్రారంభమైన బైజూస్‌ ఆన్‌లైన్‌ శిక్షణలో వేగంగా వృద్ధి చెందుతూ వచ్చింది. విస్తరణ ప్రణాళికల అమలుకు వీలుగా 2020 ద్వితీయార్ధంలో కంపెనీ నిధుల సమీకరణను చేపట్టింది. సుప్రసిద్ధ మేరీ మీకర్, యూరీ మిల్నర్‌తోపాటు.. పీఈ దిగ్గజాలు సిల్వర్‌ లేక్, బ్లాక్‌రాక్‌ నుంచి నిధులను సమకూర్చుకుంది. తద్వారా ఎడ్యుకేషన్‌ స్టార్టప్‌ కంపెనీ బైజూస్‌ విలువ 11 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఇక ముంబై కంపెనీ టాపర్‌ టెక్నాలజీస్‌.. యాప్‌ ఆధారిత విద్యా శిక్షణ, వీడియో క్లాసులు, మాక్‌ టెస్టులు, విద్యార్ధుల సందేహాలకు లైవ్‌ సమాధానాలు తదితరాలను నిర్వహిస్తోంది. కంపెనీ 16 మిలియన్‌ విద్యార్ధులను ఆకట్టుకున్నట్లు వెబ్‌సైట్‌లో పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement