E-learning
-
ఉన్నత విద్యలో మరో చరిత్ర
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా వేగంగా చోటు చేసుకుంటున్న శాస్త్ర, సాంకేతిక మార్పులకు అనుగుణంగా మన విద్యార్థులను సన్నద్ధం చేస్తూ విద్యా రంగ సంస్కరణలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా మరో కీలక అడుగు వేసింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, హార్వర్డ్, ఎంఐటీ, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జి లాంటి అత్యుత్తమ వర్సిటీలు అందించే కోర్సులను విదేశాలకు వెళ్లి చదువుకోలేని పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉచితంగా వీటిని అందుబాటులోకి తెస్తోంది. ఈమేరకు ఇప్పటికే ప్రఖ్యాత మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సుల సంస్థ ‘ఎడెక్స్’తో ఒప్పందం చేసుకుంది. పాఠ్యప్రణాళిక కోర్సుల్లో విద్యార్థి తనకు నచ్చిన వర్టికల్ను చదువుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ నెల 16వ తేదీ నుంచి వర్సిటీల్లో ఎడెక్స్ కోర్సులను సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభించేలా కసరత్తు జరుగుతోంది. ఉచితంగా రూ.30 వేల విలువైన కోర్సు.. ఎడెక్స్ ప్రపంచంలోనే ప్రముఖ ఈ–లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌గా పేరొందింది. ఇందులో 180కిపైగా వరల్డ్‌క్లాస్ వర్సిటీలు రూపొందించిన వివిధ కోర్సుల్లోని 2 వేలకు పైగా వర్టికల్స్‌ను చదువుకోవచ్చు. ఒక్కో కోర్సు చేయాలంటే సుమారు రూ.30 వేలు ఖర్చు అవుతుంది. ఇంత ఖరీదైన కోర్సులను రాష్ట్ర ప్రభుత్వం 12 లక్షల మందికిపైగా విద్యార్థులు, టీచర్లకు ఉచితంగా అందిస్తోంది. దీనికోసం ఏడాదికి సుమారు రూ.50 కోట్లకు పైగా వెచ్చించనుంది. అసైన్మెంట్స్, ప్రతిభ ఆధారంగా రాష్ట్రంలోని సాంప్రదాయ వర్సిటీలతో పాటు సాంకేతిక విశ్వవిద్యాలయాలు, వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ లాంటి 20 విశ్వవిద్యాలయాల పరిధిలోని విద్యార్థులకు ఎడెక్స్ కోర్సులను అందిస్తారు. ఉదాహరణకు డిగ్రీ సెమిస్టర్లో ఆరు సబ్జెక్టులు ఉంటే ఒకటి ఎడెక్స్ కోర్సుతో భర్తీ చేస్తారు. ఆయా కళాశాలలు, వర్సిటీలు ఎంపిక చేసిన కోర్సును విద్యార్థులు తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. ఎడెక్స్ సంస్థ సంబంధిత అంతర్జాతీయ వర్సిటీతో కలిసి విద్యార్థి అసైన్మెంట్స్, ప్రతిభ ఆధారంగా సర్టిఫికెట్ అందిస్తుంది. రాత పరీక్షను ఎడెక్స్ రూపొందించిన ప్రశ్నాపత్రంతో వర్సిటీలే నిర్వహిస్తాయి. క్రెడిట్స్‌ను కూడా వర్సిటీలే ఇస్తాయి. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఒకటి కంటే ఎక్కువ కోర్సులను కూడా చేయవచ్చు. వాటిని వాల్యూ యాడెడ్ కోర్సులుగా పరిగణించి సర్టిఫికెట్ ఇస్తారు. ఎడెక్స్ కోర్సు ఇలా.. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ విద్యార్థులు తప్పనిసరిగా ఎడెక్స్ కోర్సులు అభ్యసించేలా కరిక్యులమ్‌లో భాగం చేశారు. డిగ్రీ, పీజీ స్థాయిలో 2, 4వ సెమిస్టర్, ఇంజనీరింగ్‌లో 2, 4వ, 6వ సెమిస్టర్లలో ప్రతి విద్యార్థి వర్సిటీ/కళాశాల ఎంపిక చేసిన ఎడెక్స్ కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. విద్యార్థులతో పాటు అధ్యాపకులు కూడా ఎడెక్స్ అందించే అంతర్జాతీయ కోర్సులను అభ్యసించేందుకు అవకాశం ఉంది. తద్వారా వారు నేర్చుకున్న అంశాలను విద్యార్థులకు మరింత అర్థవంతంగా బోధించేందుకు వీలుంటుంది. విద్యార్థికి నచ్చిన సమయంలో.. విద్యార్థులు ఎడెక్స్ ఆన్లైన్ కోర్సును తమకు అనువైన సమయంలో చదువుకునే వెసులుబాటు ఉంటుంది. వారానికి నాలుగు గంటల పాటు క్లాసులు ఉంటాయి. ప్రతి విద్యార్థి ప్రత్యేక లాగిన్ ద్వారా మొబైల్ యాప్‌లో క్లాసులకు హాజరు కావచ్చు. సందేహాలను నివృత్తి చేసేందుకు ఆన్లైన్ సపోర్టింగ్ సిస్టమ్‌లో మెంటార్లు ఉంటారు. తద్వారా విద్యార్థులు స్వయంగా నేర్చుకునే సామర్థ్యాలు పెరుగుతాయి. ఉదాహరణకు బీకామ్ విద్యార్థులు హార్వర్డ్ వర్సిటీ అందించే సీఎస్ 50 ఇంట్రడక్షన్ టు కంప్యూటర్ సైన్స్, కొలంబియా వర్సిటీ నుంచి ఫ్రీ క్యాస్ ఫ్లో అనాలసిస్, మసాచుసెట్స్ వర్సిటీ నుంచి మేథమెటికల్ మెథడ్స్ ఫర్ క్వాంటిటేటివ్ ఫైనల్స్ లాంటి విభిన్న వర్టికల్స్‌ను చదువుకోవచ్చు. ఇలా ఇంజనీరింగ్, బీఏ, బీఎస్సీ, ఫార్మా, ఎంబీఏ, వ్యవసాయం, అనుబంధ రంగాలకు చెందిన విభిన్న, వినూత్న కోర్సులను అభ్యసించవచ్చు. దేశంలో అందుబాటులో లేని విప్లవాత్మక కోర్సులను ఎడెక్స్‌తో ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. తద్వారా వివిధ కోర్సుల్లో స్థానికంగా అందుబాటులో లేని బోధనా సిబ్బంది కొరతను అధిగమించవచ్చు. మెరుగైన ఉపాధి.. ఎడెక్స్‌తో రెగ్యులర్ కోర్సులు కాకుండా మార్కెట్ ఓరియంటెడ్ విద్య లభిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా మైనింగ్, డేటా అనలిటిక్స్, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, క్వాంటం కంప్యూటింగ్, ఫైథాన్ లాంటివి ప్రస్తుతం ప్రపంచంలో అభివృద్ధి చెందిన టెక్నాలజీ కోవలో ఉన్నాయి. వీటిని నేర్చుకోవాలంటే బోధనా విధానంతో పాటు అందుబాటులో ఉన్న కంటెంట్‌ను మెరుగుపరచాలి. అత్యున్నత విశ్వవిద్యాలయాలు/సంస్థలకు చెందిన అధ్యాపకులతో మన విద్యార్థులకు బోధించేలా ఎడెక్స్ దోహదం చేస్తుంది. తద్వారా విద్యార్థుల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయి. ప్రొఫెషనల్, సంప్రదాయ డిగ్రీ విద్యలో లోటుపాట్లను గుర్తించి స్కిల్ ఓరియంటెడ్ కోర్సులను అందించడం ద్వారా నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులోకి వస్తాయి. -
బైజూస్ చేతికి టాపర్ టెక్!
ముంబై: ఈలెర్నింగ్ స్టార్టప్ బైజూస్ తాజాగా ప్రత్యర్థి సంస్థ టాపర్ టెక్నాలజీస్‌ను కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈలెర్నింగ్ స్టార్టప్స్‌లో అతిపెద్ద సంస్థగా ఎదిగిన బైజూస్ ఎడ్యుటెక్ విభాగంలో కార్యకలాపాలు కలిగిన టాపర్ టెక్నాలజీస్‌పై కన్నేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆన్లైన్ లెర్నింగ్ మెటీరియల్స్ అందించే టాపర్‌ను సొంతం చేసుకునేందుకు 15 కోట్ల డాలర్లు(దాదాపు రూ. 1,100 కోట్లు) వెచ్చించనున్నట్లు అంచనా. 5–12 క్లాసుల విద్యార్ధులకు టాపర్ మెటీరియల్స్ సరఫరా చేస్తోంది. టాపర్‌కు సయిఫ్ పార్టనర్స్, హెలియన్ వెంచర్స్ ఆర్థిక మద్దతునిస్తున్నాయి. కొనుగోళ్ల జోరు కోవిడ్–19 నేపథ్యంలో కొద్ది రోజులుగా ఆన్లైన్ ఎడ్యుకేషన్‌కు డిమాండ్ భారీగా పెరిగింది. దీంతో డిమాండును అందుకునే బాటలో బైజూస్ ఇటీవల ఇతర కంపెనీలను కొనుగోలు చేయడంపై దృష్టి సారించింది. దీనిలో భాగంగా జనవరిలో ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్‌ను సొంతం చేసుకునేందుకు బిలియన్ డాలర్ల(సుమారు రూ. 7,300 కోట్లు) డీల్‌ను కుదుర్చుకుంది. కాగా.. బైజూస్– టాపర్ డీల్‌పై రెండు కంపెనీల ప్రతినిధులూ స్పందించకపోవడం గమనార్హం! 2011లో షురూ బెంగళూరు కేంద్రంగా 2011లో ప్రారంభమైన బైజూస్ ఆన్లైన్ శిక్షణలో వేగంగా వృద్ధి చెందుతూ వచ్చింది. విస్తరణ ప్రణాళికల అమలుకు వీలుగా 2020 ద్వితీయార్ధంలో కంపెనీ నిధుల సమీకరణను చేపట్టింది. సుప్రసిద్ధ మేరీ మీకర్, యూరీ మిల్నర్తోపాటు.. పీఈ దిగ్గజాలు సిల్వర్ లేక్, బ్లాక్‌రాక్ నుంచి నిధులను సమకూర్చుకుంది. తద్వారా ఎడ్యుకేషన్ స్టార్టప్ కంపెనీ బైజూస్ విలువ 11 బిలియన్ డాలర్లకు చేరింది. ఇక ముంబై కంపెనీ టాపర్ టెక్నాలజీస్.. యాప్ ఆధారిత విద్యా శిక్షణ, వీడియో క్లాసులు, మాక్ టెస్టులు, విద్యార్ధుల సందేహాలకు లైవ్ సమాధానాలు తదితరాలను నిర్వహిస్తోంది. కంపెనీ 16 మిలియన్ విద్యార్ధులను ఆకట్టుకున్నట్లు వెబ్సైట్లో పేర్కొంది. -
విద్యార్థుల కోసం జాతీయ డిజిటల్ లైబ్రరీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న విద్యా సంస్ధల్లోని డిజిటల్ పాఠ్యాంశాలు అనుసంధానించి సింగిల్ విండో ద్వారా విద్యార్థులకు అందించే లక్ష్యంతో జాతీయ డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేసేందుకు యూజీసీ ప్రయత్నాలు ప్రారంభించింది. జాతీయ డిజిటల్ లైబ్రరీని సమన్వయం చేసే బాధ్యతను ఐఐటీ ఖరగ్‌పూర్‌కు అప్పగించింది. ప్రాథమిక స్దాయి నుంచి పీజీ వరకూ అన్ని కోర్సుల్ని జాతీయ డిజిటల్ లైబ్రరీలో పొందుపరుస్తారు. లక్షకుపైగా వ్యాసాలు, 70కి పైగా భాషల్లోని పాఠ్యాంశాలు అందుబాటులో ఉంటాయి. లైబ్రరీలో నమోదు చేసుకోవాలని విద్యార్ధులకు సూచించాలని అన్ని వర్సిటీల వీసీలను కోరింది. -
జిల్లా పరిషత్ స్కూళ్ళలో 'ఈ లెర్నింగ్'..
చంద్రాపూర్ః మహరాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ విద్యావ్యవస్థలో నూతన విధానాన్ని అమలు చేస్తోంది. జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఈ లెర్నింగ్ సౌకర్యాన్ని ప్రవేశ పెట్టి గ్రామీణ విద్యార్థులను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తోంది. రాష్ట్రంలోని తడోబా అంధారి టైగర్ రిజర్వ్ (టీఏటీఆర్) లోని మారు మూల గ్రామాల్లోని సుమారు 47 పాఠశాలల్లో ముందుగా ఈ ప్రత్యేక సౌకర్యాన్ని అమలు చేస్తోంది. మహారాష్ట్రలోని మొహర్లీ జిల్లాలో ఈ-లెర్నింగ్ ప్రాజెక్టును ఆర్థిక మంత్రి సుధీర్ ముంగన్ తివార్ ఇటీవల కొత్తగా ప్రారంభించారు. జిల్లా పరిషత్ అధ్యక్షుడుగా కూడ ఉన్న తివార్... జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ సంధ్యాతాయి గుర్నులె, జిల్లాపరిషత్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహేంద్ర కల్యాణ్ కర్, టీఏటీఆర్ ఫీల్డ్ డైరెక్టర్ అండ్ ఛీఫ్ కంజర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ జెపి గరద్, బఫర్ జోన్ డిప్యూటీ డైరెక్టర్ గజేంద్ర నర్వానే సమక్షంలో ప్రాజెక్టును దిగ్విజయంగా ప్రారంభించారు. ఈ లెర్నింగ్ పాఠశాలలు మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులకు ఈ-నాణ్యతను కలిగిన విద్యను అందించి వారి జీవితాలను మార్చేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రారంభోత్సవ సందర్భంలో ఆర్థిక మంత్రి తెలిపారు. అంతేకాక ప్రపంచంలోనే ప్రకృతి, అటవీ ప్రేమికులను అమితంగా ఆకట్టుకునే తడోబా అటవీ ప్రాంతం రాష్ట్రానికి ప్రత్యేకమైన ఆస్తిగా చెప్పుకోవాలని ఆయన తెలిపారు. టీఏటీఆర్ ప్రాంతం భవిష్యత్తులో పర్యాటకంగా ఎంతో గుర్తింపు పొందే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం అందుకు ప్రత్యేక ప్రయత్నాలు చేస్తోందని వెల్లడించారు. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అటవీ ప్రాంతంలోని 12,665 జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కమిటీలు 15,500 గ్రామాలను కంప్యూటరీకరణ చేస్తున్నట్లు తెలిపారు. మహరాష్ట్ర ప్రభుత్వ పథకం జన-వన యోజన ద్వారా.. టీఏటీఆర్ బఫర్ జోన్ లోని మొత్తం 79 గ్రామాల్లో 50 గ్రామాలను అభివృద్ధి పనులకు ఎంపిక చేసినట్లు మంత్రి తెలిపారు. మొదటి దశలో భాగంగా వివిధ గ్రామాల్లో మొత్తం 99 తరగతి గదులతో 47 ఈ-లెర్నింగ్ పాఠశాలలను ప్రారంభించినట్లు వెల్లడించారు. గ్రామస్థులకోసం ప్రత్యేకంగా ప్రారంభించిన పాఠశాలల్లో మొత్తం 6,647 మంది వరకూ విద్యార్థులు ఈ లెర్నింగ్ ప్రయోజనాన్ని పొందవచ్చని టీఏటీఆర్ ఫీల్డ్ డైరెక్టర్ జెపి గరద్ తెలిపారు. -
ఈ-లెర్నింగ్ విధానాన్ని ప్రవేశపెట్టిన మహారాష్ట్ర
చంద్రపూర్ : ప్రభుత్వ పాఠశాలల్లో ఈ-లెర్నింగ్ విధానాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రారంభించింది. రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి సుధీర్ ముంగన్‌తివార్ తడోబా అంధరీ టైగర్ రిజర్వ్ పరిధిలోని 47 జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఈ-లెర్నింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో మొత్తం 99 తరగతి గదుల్లోని 6,647 మంది విద్యార్ధులు ఈ-లెర్నింగ్ సదుపాయాన్ని పొందనున్నారు. సుధీర్ మాట్లాడుతూ.. రిజర్వ్ పరిధిలోని విద్యార్ధులకు ఈ విధానం ఉపయోగపడుతుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంతు ప్రేమికులను తడోబా రిజర్వ్ ఆకర్షిస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం టీఏటీఆర్ను టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు తయారుచేస్తోందని తెలిపారు. భవిష్యత్‌లో అడవులకు చేరువలో ఉన్న 15,500 గ్రామాల్లో పనిచేస్తున్న 12,665 జాయింట్ ఫార్స్ట్ మేనేజ్మెంట్ కమిటీలను కంప్యూటరీకరణ చేయనున్నట్లు తెలిపారు. టీఏటీఆర్ పరిధిలోని 79 గ్రామాల్లో 50 గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వ జన్-వన్ యోజన కింద నిధుల సమకూర్చనున్నట్లు వివరించారు -
పల్లె పల్లెకూ బ్రాడ్‌బ్యాండ్: కేటీఆర్
హైదరాబాద్: పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి కె.తారకరామారావు అన్నారు. కంటోన్మెంట్ బాలంరాయిలోని గీతాంజలి పాఠశాలలో మంగళవారం ఏపీ, తెలంగాణ ఐసీఎస్ఈ, ఐఎస్సీ పాఠశాలల సంఘం ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మెరుగైన విద్య కోసం అవసరమైన సాంకేతిక నైపుణ్యాన్ని అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఈ-లెర్నింగ్, ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. మొదటి విడతగా రాష్ట్రంలోని రెండు వేల గ్రామాల్లో బ్రాడ్‌బ్యాండ్ ఆప్టిక్ కేబుల్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో తండాలు, పంచాయతీలు కలిపి 10 వేల గ్రామాలకు ఈ సౌకర్యం కల్పిస్తామన్నారు. విద్యాశాఖలోని అన్ని విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. జగ్గారెడ్డికి ప్రజలే గుండు కొడతారు లక్ష మెజార్టీ రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించిన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వేషంతోపాటు పార్టీని కూడా మార్చారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికలో జగ్గారెడ్డిని ప్రజలు మరోసారి ఓడించి గుండుకొడతారని జోస్యం చెప్పారు. బీజేపీని బాబుగారి జగ్గారెడ్డి పార్టీగా ఆయన వ్యంగ్యంగా అన్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన జగ్గారెడ్డికే బీజేపీ టికెట్ కేటాయించడం సిగ్గు చేటన్నారు. పొన్నాలా.. సిగ్గుందా: కేటీఆర్ ధ్వజం మెదక్: ‘పొన్నాలా నీకు సిగ్గుందా!.. కరెంట్ సమస్యకు కారణం కాంగ్రెస్ కాదా?.. బొగ్గు నిక్షేపాలున్నా తెలంగాణను కాదని ఆంధ్రలో, రాయలసీమలో విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేసింది మీరు కాదా? కనీసం ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ లైన్లు వేసేందుకు ఎప్పుడైనా ప్రయత్నించారా? వంద రోజులు కూడా నిండని టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేనిది ఏమిటి? తెలంగాణ ఉద్యమంలో కలసి నడిచారా? కనీసం పునర్నిర్మాణంలోనైనా కలిసిరండి’ అంటూ పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావు కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. మంగళవారం మెదక్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరెంట్ సమస్యకు టీఆర్ఎస్ కారణమని పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించడం తగదన్నారు. విద్యుత్ సమస్యను అధిగమించేందుకు సీఎం కేసీఆర్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం ఖాయమైపోయిందని, అందరి మైండ్‌బ్లాక్ అయ్యేలా 5 లక్షలపై చిలుకు ఓట్లతో గెలిపించాలని ఆయన కోరారు. -
భవిష్యత్తు ‘ఈ- లెర్నింగ్’దే
గాంధీ ఆస్పత్రి, న్యూస్‌లైన్: వైద్య విద్యార్థులో ఆసక్తిని కలిగించి, విద్యాప్రమాణాలు మరింత పెంపొందించేందుకు ఈ-లెర్నింగ్ ఎంతగానో దోహదపడుతుందని మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్ (ఎంఈడీఆర్‌సీ) క్లినికల్ రీసెర్చ్ డీన్ డాక్టర్ అమిత్కిషోర్ అన్నారు. గాంధీ మెడికల్ కళాశాలలో శనివారం జరిగిన ఫ్రెషర్స్‌డే సందర్భంగా ‘ఈ లెర్నింగ్-ప్రాధ్యాన్యత’ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. రానున్న కాలంలో వైద్యవిద్యా బోధనారంగంలో ఈ-లెర్నింగ్ గణనీయమైన పాత్ర పోషిస్తుందన్నారు. ఎంఈడీఆర్‌సీ డైరక్టర్ గురుమూర్తి, కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, అటానమీ హెచ్ఓడీ సీమామధన్, కేవీ సత్యనారాయణమూర్తి, రాజశేఖర్ పాల్గొన్నారు.