చంద్రపూర్ : ప్రభుత్వ పాఠశాలల్లో ఈ-లెర్నింగ్ విధానాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రారంభించింది. రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి సుధీర్ ముంగన్తివార్ తడోబా అంధరీ టైగర్ రిజర్వ్ పరిధిలోని 47 జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఈ-లెర్నింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో మొత్తం 99 తరగతి గదుల్లోని 6,647 మంది విద్యార్ధులు ఈ-లెర్నింగ్ సదుపాయాన్ని పొందనున్నారు.
సుధీర్ మాట్లాడుతూ.. రిజర్వ్ పరిధిలోని విద్యార్ధులకు ఈ విధానం ఉపయోగపడుతుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంతు ప్రేమికులను తడోబా రిజర్వ్ ఆకర్షిస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం టీఏటీఆర్ను టూరిజం స్పాట్గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు తయారుచేస్తోందని తెలిపారు. భవిష్యత్లో అడవులకు చేరువలో ఉన్న 15,500 గ్రామాల్లో పనిచేస్తున్న 12,665 జాయింట్ ఫార్స్ట్ మేనేజ్మెంట్ కమిటీలను కంప్యూటరీకరణ చేయనున్నట్లు తెలిపారు. టీఏటీఆర్ పరిధిలోని 79 గ్రామాల్లో 50 గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వ జన్-వన్ యోజన కింద నిధుల సమకూర్చనున్నట్లు వివరించారు