జిల్లా పరిషత్ స్కూళ్ళలో 'ఈ లెర్నింగ్'..
చంద్రాపూర్ః మహరాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ విద్యావ్యవస్థలో నూతన విధానాన్ని అమలు చేస్తోంది. జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఈ లెర్నింగ్ సౌకర్యాన్ని ప్రవేశ పెట్టి గ్రామీణ విద్యార్థులను ప్రత్యేకంగా ప్రోత్సహిస్తోంది. రాష్ట్రంలోని తడోబా అంధారి టైగర్ రిజర్వ్ (టీఏటీఆర్) లోని మారు మూల గ్రామాల్లోని సుమారు 47 పాఠశాలల్లో ముందుగా ఈ ప్రత్యేక సౌకర్యాన్ని అమలు చేస్తోంది.
మహారాష్ట్రలోని మొహర్లీ జిల్లాలో ఈ-లెర్నింగ్ ప్రాజెక్టును ఆర్థిక మంత్రి సుధీర్ ముంగన్ తివార్ ఇటీవల కొత్తగా ప్రారంభించారు. జిల్లా పరిషత్ అధ్యక్షుడుగా కూడ ఉన్న తివార్... జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ సంధ్యాతాయి గుర్నులె, జిల్లాపరిషత్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహేంద్ర కల్యాణ్ కర్, టీఏటీఆర్ ఫీల్డ్ డైరెక్టర్ అండ్ ఛీఫ్ కంజర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ జెపి గరద్, బఫర్ జోన్ డిప్యూటీ డైరెక్టర్ గజేంద్ర నర్వానే సమక్షంలో ప్రాజెక్టును దిగ్విజయంగా ప్రారంభించారు. ఈ లెర్నింగ్ పాఠశాలలు మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులకు ఈ-నాణ్యతను కలిగిన విద్యను అందించి వారి జీవితాలను మార్చేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రారంభోత్సవ సందర్భంలో ఆర్థిక మంత్రి తెలిపారు. అంతేకాక ప్రపంచంలోనే ప్రకృతి, అటవీ ప్రేమికులను అమితంగా ఆకట్టుకునే తడోబా అటవీ ప్రాంతం రాష్ట్రానికి ప్రత్యేకమైన ఆస్తిగా చెప్పుకోవాలని ఆయన తెలిపారు. టీఏటీఆర్ ప్రాంతం భవిష్యత్తులో పర్యాటకంగా ఎంతో గుర్తింపు పొందే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం అందుకు ప్రత్యేక ప్రయత్నాలు చేస్తోందని వెల్లడించారు. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అటవీ ప్రాంతంలోని 12,665 జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కమిటీలు 15,500 గ్రామాలను కంప్యూటరీకరణ చేస్తున్నట్లు తెలిపారు.
మహరాష్ట్ర ప్రభుత్వ పథకం జన-వన యోజన ద్వారా.. టీఏటీఆర్ బఫర్ జోన్ లోని మొత్తం 79 గ్రామాల్లో 50 గ్రామాలను అభివృద్ధి పనులకు ఎంపిక చేసినట్లు మంత్రి తెలిపారు. మొదటి దశలో భాగంగా వివిధ గ్రామాల్లో మొత్తం 99 తరగతి గదులతో 47 ఈ-లెర్నింగ్ పాఠశాలలను ప్రారంభించినట్లు వెల్లడించారు. గ్రామస్థులకోసం ప్రత్యేకంగా ప్రారంభించిన పాఠశాలల్లో మొత్తం 6,647 మంది వరకూ విద్యార్థులు ఈ లెర్నింగ్ ప్రయోజనాన్ని పొందవచ్చని టీఏటీఆర్ ఫీల్డ్ డైరెక్టర్ జెపి గరద్ తెలిపారు.