భూసార పరిరక్షణకు విద్యార్థి సైన్యం | Andhra Pradesh launched the School Soil Health Project | Sakshi
Sakshi News home page

భూసార పరిరక్షణకు విద్యార్థి సైన్యం

Published Sun, Feb 25 2024 4:53 AM | Last Updated on Sun, Feb 25 2024 4:53 AM

Andhra Pradesh  launched the School Soil Health Project - Sakshi

సాక్షి, అమరావతి: ఎరువులు, పురుగు మందుల్ని మితిమీరి వినియోగించడం వల్ల దిగుబడులు రాక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితికి చెక్‌ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున భూసార పరీక్షలు చేయిస్తూ ప్రతి రైతుకు సాయిల్‌ హెల్త్‌ కార్డులను అందజేస్తోంది. శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకు తగిన మోతాదులో ఎరువులు, మందులు వాడేలా ఆర్బీకే స్థాయిలో అవగాహన కల్పిస్తోంది.

తాజాగా మరో అడుగు ముందుకేసి భవిష్యత్‌ తరాలకు భూసార పరిరక్షణపై అవగాహన కల్పించేలా ‘స్కూల్‌ సాయిల్‌ హెల్త్‌ ప్రాజెక్ట్‌’ చేపట్టింది. భవిష్యత్‌ తరాలకు భూసార పరిరక్షణపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. విద్యార్థుల్లో ప్రకృతిపై ఆరాధన భావం పెంపొందించడం, వ్యవసాయంపై ఆసక్తి, ఉత్సుకత, రైతుల కష్టంపై చిన్ననాటి నుంచే అవగాహన కల్పించడం, వారిపట్ల బాధ్యతాయుత ప్రేమ, సాగుపై ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్‌ అమలు చేస్తోంది.

6–12వ తరగతి విద్యార్థులకు అవగాహన
తొలి దశలో రాష్ట్రంలోని 29 ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలు, 13 జవహర్‌ నవోదయ పాఠశాలలతో పాటు 8 కేంద్రీయ విద్యాలయాల్లో పైలట్‌ ప్రాజెక్ట్‌గా దీనిని చేçపడుతున్నారు. విద్యాశాఖ సమన్వయంతో వ్యవసాయ శాఖ ఈ కార్యక్రమం అమలు చేస్తోంది. ఎంపిక చేసిన పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు భూసార పరిరక్షణ–చేపట్టాల్సిన కార్యక్రమాలపై కేవీకే శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులతో అవగాహన కల్పిస్తారు. విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులకు కూడా మట్టి నమూనాల సేకరణ, రసాయనిక విశ్లేషణ, యాప్‌ ద్వారా ఫలితాల నమోదు, సాయిల్‌ హెల్త్‌ కార్డుల పంపిణీపై ఎస్‌హెచ్‌సీ మొబైల్‌ యాప్‌ ద్వారా శిక్షణ ఇస్తారు. ఇందుకు అవసరమైన  సాయిల్‌ టెస్టింగ్‌ పరికరాలను పాఠశాలలకు సరఫరా చేస్తున్నారు. మట్టి నమూనాల సేకరణ, పరీక్ష, విశ్లేషణ కోసం ప్రత్యేకంగా మొబైల్‌ యాప్‌ను అభివృద్ధి చేస్తున్నారు.

ప్రతి పాఠశాల పరిధిలో 50 నమూనాలు
ప్రతి పాఠశాల పరిధిలోని గ్రామంలో సీజన్‌కు 25 చొప్పున ఖరీఫ్, రబీ సీజన్లలో కనీసం 50 శాంపిల్స్‌కు తక్కువ కాకుండా సేకరించనున్నారు. వీటిని పాఠశాలకు అందజేసిన సాయిల్‌ టెస్టింగ్‌ కిట్‌ ద్వారా విశ్లేషించి ఫలితాలను మొబైల్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ఈ ప్రక్రియ ఏప్రిల్‌ 24వ తేదీలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. జూన్‌ 15న ఆయా పాఠశాలల పరిధిలోని గ్రామాల్లో సభలు నిర్వహించి రైతులకు సాయిల్‌ హెల్త్‌ కార్డులు జారీ చేస్తారు. భూమిలో ఉండే పోషక లోపాలను వివరిస్తూ, కోల్పోయిన భూసారం తిరిగి పొందాలంటే భూమికి ఎలాంటి పోషకాలు అందించాలి, సాగువేళ ఏ పంటకు ఎంత మోతాదులో ఎరువులు, పురుగుల మందులు వినియోగించాలి, ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలనే అంశాలపై గ్రామసభల్లో శాస్త్రవేత్తలతో రైతులకు అవగాహన కల్పిస్తారు.

విద్యార్థి దశ నుంచే ఆసక్తి 
విద్యార్థి దశ నుంచే సాగు, రైతులపై గౌరవభావం పెంపొందించడం, భూసారం పట్ల ఆసక్తి కల్పించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ చేపట్టింది. పైలట్‌ ప్రాజెక్ట్‌ విజయవంతమైతే అన్ని పాఠశాలలకు విస్తరిస్తాం. ఈ ప్రాజెక్ట్‌ కింద విద్యార్థులే స్వయంగా మట్టి నమూనాలు సేకరించి, పాఠశాలకు అందించిన కిట్‌ ద్వారా భూసార పరీక్షలు చేస్తారు. మట్టిలో ఏ లోపం ఉందో గుర్తిస్తారు. దీనివల్ల భూసార పరిరక్షణపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో విద్యార్థులకు అవగాహన కలుగుతుంది.    – చేవూరు హరికిరణ్, స్పెషల్‌ కమిషనర్, వ్యవసాయ శాఖ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement