న్యూఢిల్లీ: వృద్ధికి, దేశ నిర్మాణానికి నిధులు తప్పనిసరి అని అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత రీసోర్సెస్ పేర్కొంది. వృద్ధి అవకాశాలను దృష్టిలో పెట్టుకుని, చెల్లింపుల సామర్థ్యం ఆధారంగానే కంపెనీలు, వ్యక్తులు, ప్రభుత్వాలు రుణాలు తీసుకుంటాయనే విషయాన్ని గుర్తు చేసింది. నిర్వహణ పరిమితుల్లోపే రుణాలను కట్టడి చేస్తామని, ఈ విషయంలో ఇన్వెస్టర్ల సమూహాన్ని ఒప్పించగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు రుణాలను సకాలంలో చెల్లించిన చరిత్రను ప్రస్తావించింది.
పూర్తి చెల్లింపులకు తగిన సామర్థ్యం ఉన్నట్టు స్పష్టం చేసింది. 2023 మార్చి నాటికి తీర్చాల్సిన రుణాలకు ముందే చెల్లింపులు చేసినట్టు వేదాంత రీసోర్సెస్ తెలిపింది. గడిచిన 11 నెలల్లో 2 బిలియన్ డాలర్ల రుణాలను తగ్గించుకున్నట్టు వివరించింది. 2023 జూన్‌తో ముగిసే త్రైమాసికం వరకు నిధుల అవసరాలను చేరుకోగలమని విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. సంస్థ చరిత్రలో ఇప్పటి వరకు 35 బిలియన్ డాలర్ల నిధులు సమీకరించగా, వాటన్నింటికీ సకాలంలో చెల్లింపులు చేసినట్టు ప్రకటించింది.
అధిక నగదు ప్రవాహాలను తెచ్చిపెట్టే బ్రహ్మాండమైన ఆస్తులు ఉన్నాయంటూ నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం చేస్తున్న విస్తరణతో సమీప భవిష్యత్తులో ఆదాయం 30 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ‘‘వేదంతా కంపెనీలు అన్నీ కూడా టాప్ సీఈవోల ఆధ్వర్యంలో నిపుణులతో నిర్వహిస్తున్నవి. అధిక వృద్ధి అవకాశాలతో, తక్కువ నిర్వహణ వ్యయాలతో వేదాంతా గ్రూప్ వ్యాపారాలను నిర్వహిస్తోంది. భారత్ ఆర్థిక పురోగతిలో మేము కూడా భాగస్వాములు అవుతాం’’అని లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో వేదాంత రీసోర్సెస్ పేర్కొంది. వేదాంత లిమిటెడ్ ప్రమోటర్ సంస్థకు భారీ రుణాలు ఉండడంతో.. అదానీ తర్వాత వేదాంతా గ్రూపు రుణ సమస్యలు ఎదుర్కోనుందంటూ ఆందోళనలు వస్తున్న నేపథ్యంలో ఈ పోస్ట్ విడుదల చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment