శాన్‌ఫ్రాన్సిస్కో: ఐఫోన్ల దిగ్గజం యాపిల్ తయారీ తొలి హెడ్‌ఫోన్స్‌ను మరింత విలాసవంతంగా తీర్చిదిద్దింది. రష్యన్ కంపెనీ కేవియర్. ఎయిర్‌పోడ్స్ మాక్స్‌ను స్వచ్చమైన బంగారంతో రూపొందించింది. నిజానికి ఎయిర్‌పోడ్స్ మాక్స్ ఇయర్ కప్స్‌ను యాపిల్ కంపెనీ అల్యూమినియంతో తయారు చేస్తోంది. అయితే బాగా ప్రాచుర్యం పొందిన గ్యాడ్జెట్స్‌ను లగ్జరీ ఐటమ్స్‌గా మలిచే రష్యన్ కంపెనీ కేవియర్ వీటిని ప్యూర్ గోల్డ్‌తో రూపొందించింది. అంతేకాకుండా మెష్ హెడ్‌బ్యాండ్‌ను అరుదైన క్రోకొడైల్ లెదర్‌తో అలంకరించింది. వెరసి యాపిల్ హెడ్‌ఫోన్స్ ఖరీదు 1.08 లక్షల డాలర్లుగా ప్రకటించింది. అంటే సుమారు రూ. 80 లక్షలన్నమాట! వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా(కస్టమ్ మేడ్) వీటిని పరిమితంగానే తయారు చేయనున్నట్లు కేవియర్ పేర్కొంది. కొత్త ఏడాది(2021)లో ఈ హెడ్‌ఫోన్స్ మార్కెట్లో విడుదలకానున్నట్లు తెలుస్తోంది. చదవండి: (యాపిల్ నుంచి తొలిసారి హెడ్‌ఫోన్స్)
తొలి హెడ్‌ఫోన్స్
ఈ నెల మొదట్లో ఎయిర్‌పోడ్స్ మ్యాక్స్ పేరుతో యాపిల్ తొలిసారి హెడ్‌ఫోన్స్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిని రూ. 59,900 ధరలో ప్రవేశపెట్టింది. స్పష్టమైన శబ్దం, అడాప్టివ్ ఈక్వలైజర్, అనవసర శబ్దాలను తగ్గించే సాంకేతికలతో వీటిని రూపొందించింది. కాగా.. వీటికి మరింత ప్రీమియంను జత చేస్తూ రష్యన్ లగ్జరీ బ్రాండ్ కేవియర్.. తాజాగా గోల్డ్ ప్లేటెడ్ కప్స్‌తో రూపొందించింది. వీటిని రెండు కలర్స్‌లో అందిస్తున్నట్లు తెలియజేసింది. నలుపు, తెలుపు రంగుల్లో లభించే ఈ హెడ్‌ఫోన్స్‌ను ప్యూర్ గోల్డ్‌తోపాటు.. హెడ్‌బ్యాండ్‌ను క్రోకొడైల్ లెదర్‌తో రూపొందించినట్లు వెల్లడించింది. రెండు రంగుల్లోనూ బంగారంతో చేసిన కప్స్, లెదర్ హెడ్‌బ్యాండ్‌లతో ఇవి లభించనున్నట్లు వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment