హౌతీ రెబల్స్‌.. సంక్షోభంలో సముద్ర రవాణా! | Companies Fear About Red Sea Crisis Its Impact Their Profits | Sakshi
Sakshi News home page

సంక్షోభంలో సముద్ర రవాణా.. కంపెనీల హైరానా

Published Sat, Mar 16 2024 10:10 AM | Last Updated on Sat, Mar 16 2024 12:53 PM

Companies Fear About Red Sea Crisis Its Impact Their Profits - Sakshi

భారత్‌ నుంచి నుంచి యూరప్‌, ఆఫ్రికా దేశాలతోపాటు ఉత్తర అమెరికా దేశాలకు సరకు చేయడానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం ప్రధానపాత్ర పోషిస్తాయి. సదరు దేశాల నుంచి సరుకులు, ముడి పదార్థాలు మనదేశానికి రావాలన్నా అదే మార్గం. ఇటీవల కాలంలో ఎర్ర సముద్రంలో చోటుచేసుకుంటున్న అనిశ్చిత పరిస్థితులతో అంతర్జాతీయ వాణిజ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ఈ ప్రాంతంపై రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం ఉంది. దీనికి తోడు సోమాలియా, తదితర దేశాలకు చెందిన సముద్ర దొంగల తాకిడి పెరిగింది. ఇప్పుడు అదనంగా యెమెన్‌కు చెందిన హౌతీ రెబెల్స్‌ అంతర్జాతీయ సరకు రవాణా నౌకలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. దీంతో దేశీయంలో సరుకు, ముడివస్తువులు రవాణా చేస్తున్న కంపెనీలకు నష్టం వాటిల్లుతుంది. 

ఏ కంపెనీలపై ప్రభావం అంటే..

స్పెషాలిటీ పైపులు, ట్యూబుల ఉత్పత్తిలో నిమగ్నమై ఉన్న ఏరోఫ్లెక్స్‌ ఇండస్ట్రీస్‌ ఆదాయాలు ఈ మూడో త్రైమాసికంలో అంచనాలకు అనుగుణంగా పెరగలేదు. ఈ సంస్థ ఆదాయాల్లో 85 శాతం వరకూ ఎగుమతులే ఉండటం గమనార్హం. ఎర్ర సముద్రంలో చోటుచేసుకుంటున్న ఉదంతాలతో అంతర్జాతీయ సరకు రవాణా సమస్యాత్మకంగా మారినట్లు, అందువల్ల ఆదాయ అంచనాలను అందుకోలేకపోయినట్లు ఈ సంస్థ యాజమాన్యం ఆర్థిక ఫలితాలు వెల్లడించిన తర్వాత మదుపరులకు వివరించింది. ప్రస్తుత త్రైమాసికంలోనూ కొంత ఇబ్బంది తప్పకపోవచ్చని, అయినప్పటికీ తగిన పరిష్కారాల కోసం అన్వేషిస్తున్నట్లు స్పష్టం చేసింది. అంతర్జాతీయ వాణిజ్యంలో ఖర్చులు కూడా పెరిగినట్లు వెల్లడించింది.

 

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న పోకర్ణ ఇంజినీర్డ్‌ స్టోన్‌ లిమిటెడ్‌ కూడా దాదాపు ఇదే విధమైన పరిస్థితులను ఎదుర్కొంది. నౌకల రాకపోకలు నిలిచిపోతున్నాయని, దీనివల్ల ఇతర దేశాలకు సరకు పంపించటం కష్టంగా మారిందని సంస్థ సీఈఓ పరస్‌ కుమార్‌ జైన్‌ త్రైమాసిక ఫలితాల ప్రకటన అనంతరం కాన్ఫరెన్స్‌ కాల్‌లో మదుపరులకు వివరించారు. అంతేగాక అటు వినియోగదార్లకు, ఇటు తమకు ఖర్చులు పెరిగినట్లు పేర్కొన్నారు. ఐరోపా దేశాల నుంచి ఈ సంస్థ కొన్ని ముడిపదార్థాలు కూడా తెచ్చుకుంటుంది. దీనివల్ల ప్రస్తుత పరిస్థితుల్లో తమపై రవాణా ఛార్జీల భారం అధికంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. మరో రెండు, మూడు నెలల పాటు ఇవే పరిస్థితులు ఉంటాయని అంచనా వేస్తున్నట్లు, దానికి తగ్గట్లుగా తాము సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. 

ఇదీ చదవండి: ఒక్కో వ్యక్తికి వందల్లో సిమ్‌ కార్డులు, బ్యాంక్‌ ఖాతాలు..!

ఎగుమతులు, దిగుమతులు అధికంగా ఉన్న పలు ఇతర కంపెనీలు సైతం ఇదే విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానిక పరిశ్రమ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి తగిన మద్దతు అవసరమని ఆ వర్గాలు కోరుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement