ఎయిర్ ఇండియా సంస్థపై ఏవియేషన్ రెగ్యులేటర్ అయిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) గురువారం రూ.30 లక్షల జరిమానా విధించింది. ముంబైలోని అరైవల్ ఏరియాలో నడుస్తూ కుప్పకూలి మరణించిన 80 ఏళ్ల ప్రయాణికుడికి వీల్ చైర్ ఇవ్వనందుకు ఎయిర్ ఇండియాపై ఈ చర్యలకు పూనుకున్నట్లు తెలిసింది.
వివరాల్లోకి వెళితే..ఫిబ్రవరి 12న ఓ 80 ఏళ్లు వృద్ధడు అతడి భార్యతో కలిసి ఎయిరిండియా విమానంలో ముంబైకి వస్తున్నాడు. ఎయిర్‌పోర్ట్‌కు రాగానే అక్కడ సిబ్బందిని వీల్‌చైర్ అడిగాడు. అయితే అప్పటికే అతని భార్య వీల్‌చైర్‌ని ఉపయోగిస్తుంది. తనకోసం మరొకటి కావాలని కోరాడు. సరైన సమయానికి అందుబాటులో వీల్‌చైర్‌లు లేవు. దాంతో కాసేపు వేచి ఉండాలని సిబ్బందివారిని కోరారు. అప్పటికే ఆలస్యం కావడంతో ఆ ప్రయాణీకుడు నడిచి వెళ్లడానికి ఇష్టపడ్డాడు. దాంతో తన భార్యను తీసుకుని ఇమ్మిగ్రేషన్ విభాగం వరకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు ఉన్నట్టుండి కుప్పకూలిపోయి మరణించాడు.
ఈ విషయాన్ని పరిశీలించిన డీజీసీఏ ఎయిర్ ఇండియాకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. సంస్థ ఫిబ్రవరి 20న నోటీస్‌కు స్పందిస్తూ వివరణ ఇచ్చింది. వృద్ధ ప్రయాణికుడు మరో వీల్‌చైర్ కోసం ఎదురుచూడకుండా తన భార్యతో కలిసి వెళ్లిపోయాడని చెప్పింది. అయితే, సంస్థ వీల్‌చైర్‌ను అందించకుండా సివిల్ ఏవియేషన్ రిక్వైర్‌మెంట్స్(సీఏఆర్) నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుందని అని రెగ్యులేటర్ తెలిపింది. అంతేకాకుండా, ఎయిర్ ఇండియా తప్పు చేసిన సిబ్బందిపై తీసుకున్న చర్యలేమిటో తెలియజేయలేదని డీజీసీఏ ఘాటుగా స్పందించింది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిరోధించేలా ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందో చెప్పడంలో సంస్థ విఫలమైందని తెలిపింది.
ఇదీ చదవండి: ఒకప్పుడు షేర్ ధర రూ.2,700.. ఇప్పుడు ‘జిరో’..
సీఏఆర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్, 1937 ప్రకారం ఎయిర్ ఇండియాకు రూ.30 లక్షలు జరిమానా విధించినట్లు డీజీసీఏ తెలిపింది. ప్రయాణ సమయంలో విమానం ఎక్కేటప్పుడు లేదా దిగేటప్పుడు సహాయం కోరుతున్న ప్రయాణీకుల కోసం తగిన సంఖ్యలో వీల్‌చైర్లు అందుబాటులో ఉండేలా అన్ని విమానయాన సంస్థలు చర్యలు తీసుకోవాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment