కొవిడ్ సమయంలో ఎడ్యుకేషన్ రంగంలో బైజూస్ ఓ వెలుగు వెలిగింది. భారీగా నియామకాలు చేపట్టింది. క్రమంగా కరోనా భయాలు తొలగడంతో కార్యకలాపాలు భారంగా మారి అప్పుల్లోకి వెళ్లినట్లు వ్యాపార వర్గాలు తెలిపాయి. దాంతో ఆ కంపెనీ లావాదేవీలతో సంబంధం ఉన్న కొన్ని ఇతర సంస్థలు నోటీసులు సైతం పంపిచాయి. తాజాగా ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. ఆయనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లుకౌట్ నోటీసులు జారీ చేసింది.
దేశం విడిచి వెళ్లకుండా చూడాలని సంబంధిత వర్గాలను ఆదేశించింది. గత ఏడాది బెంగళూరులో రెండు కార్యాలయాలతో పాటు ఆయన నివాసంలో సోదాలు జరిపింది. ఇప్పటికే రవీంద్రన్‌పై ‘ఆన్ ఇంటిమేషన్ లుకౌట్ సర్క్యులర్’ అమల్లో ఉంది. అంటే విదేశాలకు వెళ్లినప్పుడు ఇమ్మిగ్రేషన్ అధికారులు ఈడీకి ముందుగానే సమాచారం అందజేయాల్సి ఉంటుంది. తాజాగా పూర్తిస్థాయి లుకౌట్ సర్క్యులర్ జారీ అవడంతో ఇకపై దేశం విడిచి వెళ్లే అవకాశం ఉండదు.
మరోవైపు రవీంద్రన్‌ను సీఈఓ పదవి నుంచి తొలగించేందుకు కొంత మంది వాటాదారులు ఎమర్జెన్సీ జనరల్ మీటింగ్(ఈజీఎం)కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా కొత్త బోర్డును ఎన్నుకోవాలని అనుకున్నట్లు తెలిసింది. దానికోసం ఫిబ్రవరి 23న సమావేశం ఏర్పాటు చేయాలని సంస్థను కోరారు. అయితే వాటాదారుల కోరికను సవాలు చేస్తూ బైజూస్ కర్ణాటక హైకోర్టులో సంప్రదించింది. దీనిపై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఈజీఎం నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ, అందులో తీసుకునే నిర్ణయాలను మాత్రం తదుపరి విచారణ వరకు వాయిదా వేయాలని చెప్పింది.
ఇదీ చదవండి: కృత్రిమ వజ్రాలు తయారీ.. లాభనష్టాలు ఎవరికంటే..
ఫ్రాన్స్ కంపెనీ పిటీషన్ దాఖలు చేయడంతో బైజూస్ సంస్థ ఇటీవల నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ (ఎన్‌సీఎల్‌టీ) నుంచి నోటీసులు అందుకుంది. ఇదిలా ఉండగా, వడ్డీ రేట్లు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు బైజూస్ అమెరికా విభాగం ఆల్ఫా 2021లో టర్మ్‌లోన్-బీ తీసుకుంది. అయితే, కంపెనీ 500 మిలియన్ డాలర్ల మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఇతర అనుబంధ సంస్థలకు బదలాయించిందని, రుణ చెల్లింపులను వేగవంతం చేయాలని రుణదాతలు అమెరికాలోని డెలావేర్ కోర్టును గతంలో ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీన్ని న్యాయస్థానంలో సవాలు చేసిన బైజూస్.. రుణదాతలతో వివాదాన్ని పరిష్కరించుకునే ప్రయత్నాల్లో ఉందని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment