ముంబై: అక్రమ ధనార్జనా నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) నిబంధనల కింద సోమవారం అరెస్టయిన దీపక్ కొచ్చర్ సెప్టెంబర్ 19వ తేదీ వరకూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉంటారు. ఈ మేరకు మంగళవారం ఇక్కడి ప్రత్యేక కోర్టు జడ్జి మిలిద్ వీ కుర్తాదికర్ కస్టడీ ఆదేశాలు ఇచ్చారు. దీపక్ కొచ్చర్ ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందా కొచ్చర్ భర్త అయిన సంగతి తెలిసిందే. చందా కొచ్చర్ ఐసీఐసీఐ బ్యాంక్‌కు సీఈఓగా ఉన్న సమయంలో, వీడియోకాన్ సంస్థకు రుణాలు మంజూరు చేయడం ద్వారా తన భర్త సంస్థకు అక్రమ లబ్ది చేకూర్చారని, తద్వారా చందా కొచ్చర్ దంపతులు లాభపడ్డారన్నది దర్యాప్తు సంస్థ వాదన.
ఈ ఏడాది మొదట్లో వీరికి చెందిన రూ.78 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కూడా ఈడీ జప్తు చేసింది. దీపక్ కొచ్చర్‌కు చెందిన కొన్ని కంపెనీలు, వాటాలు కూడా జప్తు అయిన వాటిలో ఉన్నాయి. వీడియోకాన్ గ్రూప్‌నకు బ్యాంక్ రుణాల విషయంలో కొచ్చర్ దంపతులను ఈడీ పూర్తి స్థాయిలో ప్రశ్నించింది. అయితే కొన్ని లావాదేవీల గురించి వివరించలేకపోవడంతో దీపక్ కొచ్చర్‌ను అరెస్టు చేయాల్సి వచ్చిందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.
రిమాండ్ రిపోర్ట్ ఏమి చెబుతోంది?
రిమాండ్ రిపోర్ట్‌ను కోర్టు ముందు ఉంచిన ఈడీ, కేసులో మరింత ప్రశ్నించడానికి దీపక్ కొచ్చర్ కస్టడీని కోరుతున్నట్లు తెలిపింది. ఈడీ కోర్టుకు తెలిపిన సమాచారం ప్రకారం, 2009 సెప్టెంబర్ 7న వీడియోకాన్ ఇన్టర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (వీఐఈఎల్)కు ఐసీఐసీఐ బ్యాంక్ రూ.300 కోట్ల రుణాలను మంజూరు చేసింది. ఈ రుణ మంజూరు సమయంలో బ్యాంక్ మంజూరు కమిటీకి దీపక్ కొచ్చర్ భార్య చందా కొచ్చర్ చైర్మన్‌గా ఉన్నారు. ఈ రుణం మంజూరు అయిన కేవలం ఒక్క రోజు తర్వాత రూ.64 కోట్లు వీఐఈఎల్ నుంచి నుపవర్ రిన్యూవబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్‌ఆర్‌పీఎల్)కు బదిలీ అయ్యాయి. ఈ కంపెనీ దీపక్ కొచర్చర్‌కు చెందినది.
దీపక్ కొచ్చర్ విచారణకు సహకరించడం లేదు. రూ.64 కోట్ల బదలాయింపు విషయమై ఆయనను మరింత లోతుగా ప్రశ్నించాల్సి ఉంది. అయితే ఈడీ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ వాదనలను దీపక్ కొచ్చర్ న్యాయవాది విజయ్ అగర్వాల్ తోసిపుచ్చారు. తన క్లైయింట్ 12 సార్లు ఈడీ విచారణకు హాజరై, అడిగిన పత్రాలన్నింటినీ సమర్పించినట్లు తెలిపారు. అయితే ఇరువురు వాదనలు ఉన్న జడ్జి, ‘‘దీపక్ కొచ్చర్ కస్డోడియన్ ఇంటరాగేషన్ తప్పనిసరి అని భావిస్తున్నట్లు’’ పేర్కొన్నారు. చందాకొచ్చర్, దీపక్ కొచ్చర్ వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ దూత్ తదితరులపై సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ అధ్యయనం అనంతరం ఈడీ తన రిపోర్టును జడ్జి ముందు ఉంచింది. వీడియోకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు రుణ మంజూరీల ద్వారా కొచ్చర్ దంపతులు ప్రయోజనం పొందారన్నది ఆరోపణ
19 వరకూ ఈడీ కస్టడీలో దీపక్ కొచ్చర్
Published Wed, Sep 9 2020 9:58 AM | Last Updated on Wed, Sep 9 2020 9:58 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment